కొబ్బరికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతుకు ఏమాత్రం సరిపోదు
1 min readకొబ్బరి క్వింటాల్ కు రూ.15వేలు కనీస మద్దతు ధర ప్రకటించాలి
ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి ప్రకటించిన కనీస మద్దతు ధర కొబ్బరి రైతుకు ఏమాత్రం సరిపోదని, క్వింటాల్ కొబ్బరికి రూ.15వేలు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో సంక్షోభంలో కొబ్బరి సాగు – కొబ్బరి రైతుకు కనీస మద్దతు ధర అంశంపై నిర్వహించిన కొబ్బరి రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ. 11,160 ఉండగా 2025 కు రూ.422లు పెంచి రూ.11,582 గాను, 2024లో బంతి కొబ్బరి క్వింటాల్ కు రూ. 12 వేలు ఉంటే 2025కు రూ.100 లు పెంచి రూ.12,100 గా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస మద్దతు ధరలు ప్రకటించిందని చెప్పారు. కొబ్బరి సాగుకు పెరిగిన ఖర్చుల రీత్యా, తెగుళ్లు ఇతర కారణాల వలన తగ్గిన దిగుబడి రీత్యా ఈ మద్దతు ధర రైతుకు ఏమాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొబ్బరి దిగుబడులు తగ్గిపోవడంతో ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్ లో ఒక్కో కొబ్బరికాయకు రూ.13 నుండి రూ.16 లు ధర వస్తున్నా ఈ ధర నిలకడ కాదని చెప్పారు. ఇప్పటికే కొబ్బరికాయలకు కనీస ధరలు రాక కొబ్బరి రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కొబ్బరికి కనీసం మాత్రం ధర పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో కొబ్బరి ధర ప్రైవేటు వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. నాఫెడ్, ఆయిల్ ఫెడ్ కొనుగోలు సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, కొబ్బరి ధర పడిపోయిన సందర్భాలలో రైతుల నుండి కొబ్బరిను సేకరించే చర్యలు చేపట్టడం లేదన్నారు. అంతర పంటలు కారణంగానే కొబ్బరి తోటలు ఉన్నాయని చెప్పారు. అంతర పంటలు సాగు లేకపోతే కొబ్బరి తోటలు తొలగించడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొబ్బరి సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా కొబ్బరి రైతులకు ప్రోత్సాహాలు అందించాలని, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.కొబ్బరికి బీమా పథకం అమలు చేస్తున్నామని చెబుతున్నా రైతులకు ఏమాత్రం భీమా లేదని చెప్పారు. రైతులు ప్రీమియం కట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల వలన, తెగులు వలన రైతుల నష్టపోయిన సందర్భంలో నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవని చెప్పారు. రైతులను ఆదుకునే విధంగా బీమా పథకం అమలు చేయాలని కోరారు. కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచాలని, కొబ్బరి రైతుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు రామకృష్ణ, గుదిబండి రమేష్ రెడ్డి పలువురు కొబ్బరి రైతులు పాల్గొన్నారు.