కోడి పందేలను,జూద క్రీడలను అధికారులు అడ్డుకోండి
1 min readసంక్రాంతి పేరిట జంతుహింస జరుగకుండ చూడాలి
హైకోర్టు ఉత్తర్వులు కచ్ఛితంగా అందరూ పాటించాలి.. జిల్లా కలెక్టర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: సంక్రాంతి సంబరాల పేరిట కోడిపందేలు, జంతుహింస జరుగకుండా నియంత్రణా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు మేరకు జిల్లాలో రెవిన్యూ,పోలీస్ యంత్రాంగం, స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిదులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సంబరాల పేరిట కోడిపందేలు, జూదాలు జరుగకుండా చూసేందుకు జిల్లాలో అన్ని మండలాల్లో 28 సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు గట్టినిఘాతో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఈ కమిటీల్లో ఆయా మండల తహశీల్దారు, ఎస్ హెచ్ఓ, ఎన్ జివో ప్రతినిధి, ఇద్దరు కానిస్టేబుల్స్, ఇద్దరు వీడియో గ్రాఫర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. కోడిపందేలు,బెట్టింగులు, జూదాలు తదితర సామాజిక దురాచారాల నియంత్రణకు ఈ కమిటీలు పనిచేస్తాయి. అదే విధంగా ఈ సమన్వయ కమిటీలు ప్రజల్లో కోడిపందేలు నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. కోడిపందేలతోపాటు ఇతర నిషిద్ధ ఆటలను ఆడటాన్ని ఎట్టి పరిస్ధితుల్లో ఉపేక్షించరాదన్నారు. కోడిపందేలు నిషేదంపై గ్రామాల్లో టాం టాం వేయడం, మైక్ ప్రచారం, తదితర విస్త్రృత ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అదే విధంగా సంయుక్త తనిఖీ బృందాలు నిర్వర్తించాల్సిన విధి విధానాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.