పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
1 min readపత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం. ఎస్. భారతి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి అన్నారు. “అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే” సందర్భంగా శనివారం స్థానిక కోర్టు ఆవరణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన జడ్జి భారతి మాట్లాడుతూ పిల్లలు చిన్న ,చిన్న కారణాలతో తల్లిదండ్రులలో గొడవ పడి , ఇల్లు వదిలేసి వెళ్తున్నారన్నారు. దేశంలో, మన రాష్ట్రంలో ప్రతి ఏటా మిస్సింగ్ చిల్డ్రన్స్ కేసులు పెరుగు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సింగ్ చిల్డ్రన్ కేసులలో 71 శాతం ఆడపిల్లలు ఉండటం మరింత బాధాకరం అన్నారు. ఇంట్లో నుంచి వెళ్లిన పిల్లలు బయట వేధింపు గురి అవుతున్నారని, అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారి చేతుల్లో పావులు గా మారుతున్నారని అన్నారు. యుక్త వయస్సుకు వచ్చిన పిల్లల ప్రవర్తన ను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. పిల్లలను మంచి పౌరులుగా పెంచాల్సిన సామాజిక బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రంగస్వామి, ప్రధాన కార్యదర్శి మహేశ్, న్యాయవాదులు మైరాముడు, ఈరన్న, రవి ప్రకాష్, బాలభాష, ప్రసాద్ బాబు, వీరేష్, లోక్ అదాలత్ సిబ్బంది రవణమ్మ, ప్రసాద్, కక్షిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.