ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొండి
1 min readప్రతి అర్జీని క్షుణ్ణంగా చదవండి
పిజిఆర్ఎస్ లో స్వీకరించిన 170 సమస్యలు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలు అర్జీలను క్షుణ్ణంగా చదివి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్జీదారునికి సరైన ఎండార్స్మెంట్ ఇస్తూ రసీదు పొందాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదులు రీఓపెన్ కావడానికి గల కారణాలకు సంబంధించి దాదాపు పది అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. 24 గంటల లోపల పరిష్కరించాల్సిన మూడు ఫిర్యాదులు, 34 రీఓపెన్ అయిన ఫిర్యాదులు, 20 సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు, ఇంకా బియాండ్ ఎస్ఎల్ఏ లో ఉన్న అర్జీలపై తక్షణమే స్పందించి క్లియర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డీఈఓ కార్యాలయానికి సంబంధించి 24 గంటల నుండి 48 గంటల లోపల ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నీ ఈరోజే క్లియర్ చేయాలని లేని పక్షంలో బియాండ్ ఎస్ఎల్ఎ లోకి వెళ్తాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంకా ఎంప్లాయిస్ హౌస్ హోల్డ్ డేటాలో 93 వేల మంది నమోదు కాలేదని, నంద్యాల పట్టణంలోనే 21 వేల మంది ఉన్నారని ఆధార్ లింక్ చేసి హౌస్ హోల్డ్ డేటాలో నమోదు కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాట్లాడుతూ బండి ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, బనగానపల్లి, సంజామల మండలాలలో పెండింగ్ లో ఉన్న ఫ్రీ హోల్డ్ భూముల డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని ఆర్డీఓ, సంబంధిత తాసిల్దార్లను ఆదేశించారు.
పిజిఆర్ఎస్ స్వీకరించిన కొన్ని సమస్యలు
ఆళ్లగడ్డ మండలానికి చెందిన వెంకటేశ్వర్లు తనకు జీవనాధారం ఏమి లేదని తనకు ప్రభుత్వ పింఛన్ మంజూరు చేయవలసినదిగా కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.నందికొట్కూరు మండల వాస్తవ్యుడు శ్రీనివాసులు తన రెండు కాళ్ళు పనిచేయటం లేదని తాను ప్రస్తుతం వాకర్ సహాయంతో నడుస్తున్నానని ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదని తనకు మూడు చక్రాల సైకిల్ మంజూరు చేయవలసినదిగా కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.నంద్యాల మండలం రైతు నగరానికి చెందిన షేక్ ఖజాబీకి సర్వే నంబర్ 113/2 లో 3 ఎకరాల భూమిలో 30 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నాననీ నా పేరు ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో 170 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.