PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నారులపై మహిళలపై అత్యాచారాలను హత్యలను ఖండిస్తూ పిడిఎస్ఓ

1 min read

ఆధ్వర్యంలో విజయవంతమైన సభ

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలను హత్యలను ఖండిస్తూ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మక్బూల్ ఫంక్షన్ హాల్ నందు పిడిఎస్ఓ జిల్లా నాయకులు సురేంద్ర అధ్యక్షతన జరిగింది.ఈ సభలో పిడిఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్. ఆష మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతున్న అత్యాచార ఘటనలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. పసిపాపల నుండి ముసలివారి వరకు ఏ క్షణంలో ఏం జరుగుతుందనే అభద్రతతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంటా, బయట స్కూల్లో, కాలేజీల్లో, హాస్టల్లో, పని ప్రదేశాల్లో ఎక్కడా భద్రతలేని పరిస్థితి దాపురించింది. నేడు రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికంగా మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన మైనర్లు, యువత  ఉండటం గమనార్హం అన్నారు . హత్యో, అత్యాచారమో జరిగినప్పుడల్లా ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుంది తప్పిస్తే  మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఏ పనికి ఎటువంటి పర్యవసానాలు ఉంటాయో తెలియని పసి మనసులు నేడు  మద్యం, మత్తు పదార్థాలకి, సినిమాలలో అసభ్య దృశ్యాలకి, పోర్న్ సైట్లకి, ఆన్లైన్ గేమ్ లకి బానిసలవుతున్నారు. రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు నేడు నేరస్తులవుతున్నారు. మద్యం, మత్తు పదార్థాలను, విష సంస్కృతిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం నేడు చోద్యం చేస్తున్నది. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని మైనర్లలో, యువతలో నేడు నేర ప్రవృత్తిని పెంచుతూ మహిళలపై, చిన్నారులపై హత్యలకు, అత్యాచారాలకు కారణమవుతున్న మద్యం, మత్తు పదార్థాలను నిషేదించాలని అన్నారు.  పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు కే. తిరుమలేష్ మాట్లాడుతూ నేడు ఎక్కువగా మైనర్లు కూడా నేరాలకు, అత్యాచారాలకు పాల్పడటం సమాజంలో విష సంస్కృతి యొక్క తీవ్రతను తెలియజేస్తుంది.  ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పెట్టుబడిదారుల వ్యాపారమే లక్ష్యంగా మద్యం, మతపదార్థాలను విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు మద్యం షాపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేడు ఆ హామీని నెరవేర్చకపోగా, విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, హాస్పిటల్లు మొదలైన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉన్న చోటు నుంచి 100 మీటర్ల లోపు మద్యం షాపులు పెట్టకూడదనే కనీస నిబంధనని కూడా తుంగలో తొక్కింది. మరొకవైపు సెల్ఫోన్లో అశ్లీల వీడియోలను, ఫ్రీ ఫైర్ వంటి హింసాత్మక వీడియో గేమ్ లను  అందుబాటులో ఉంచుతున్నారు. స్త్రీలను భోగ వస్తువుగా, సెక్స్ సింబల్స్ గా చూపిస్తున్న టీవీ ప్రోగ్రాంలకు, సినిమాలకు, సీరియల్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. కారణంగానే నేడు ఒక మంచి భవిష్యత్తును నిర్మించాల్సిన యువతీ, యువకుల మెదళ్ళు విషతుల్యం అవుతున్నాయి. కనుక మహిళలపై, చిన్నారులపై హత్యలకు, అత్యాచారాలకు కారణమవుతున్న మద్యం మత్తు పదార్థాలను ఫోర్న్ సైట్లను నిషేధించాలని, స్త్రీని బోగ వస్తువుగా చిత్రిస్తూ పతన విలువలకు కారణమవుతున్న సినిమాలను, టీవీ ప్రోగ్రాంలను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సామ్రాజ్యవాద విష సంస్కృతికి, పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా నేటి విద్యార్థి, యువత పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ ఇమ్రాన్, ప్రతాప్ మరియు పిడిఎస్ఓ మహిళా కన్వీనర్, కో కన్వీనర్ నికిత, శ్రావణి, ఎన్ వై ఎస్ కే. వీరేష్ తదితర విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author