భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
1 min readఅధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
డివిజన్, మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ నెల 13వ తేది నుండి 16వ తేది వరకు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఆదివారం భారీ వర్షాల సూచన నేపథ్యంలో కలెక్టర్ సబ్ కలెక్టర్,ఆర్డీవోలు, తహసీల్దార్లు,మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 13 నుంచి 16వ తేది వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, ఏ సమస్య ఉన్నా 08518-277305 నెంబర్ కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు ఆయా మండల, డివిజన్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న మట్టి మిద్దెలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాల భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అవసరమైతే ప్రజలకు అందచేయడానికి నిత్యావసర వస్తువులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.. భారీ వర్షాలు కురిస్తే, లోతట్టు ప్రాంతాల వారిని తరలించడానికి వీలుగా భవనాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.