PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజ‌ల స్పంద‌నే టిడిపి గెలుపునకు నిద‌ర్శనం..

1 min read

టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టి.జి. భరత్​

పెద్ద మార్కెట్ నుండి మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ర‌కు టి.జి భ‌ర‌త్ భారీ ర్యాలీ

వేలాదిగా త‌రలివ‌చ్చిన ప్రజ‌లు.. ప‌సుపుమ‌య‌మైన న‌గ‌రం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు ప్రజ‌ల స్పంద‌న త‌న విజ‌యానికి సంకేత‌మ‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని పెద్ద మార్కెట్ వ‌ద్ద నుండి మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ర‌కు ఆయ‌న త‌న తండ్రి, మాజీ రాజ్యస‌భ స‌భ్యులు, బీజేపీ నేత టి.జి వెంక‌టేష్‌తో పాటు నేత‌లంద‌రితో క‌లిసి భారీ ర్యాలీ చేప‌ట్టారు. అనంత‌రం జ‌న‌సేన ఇంచార్జి అర్షద్, బీజేపీ క‌న్వీన‌ర్ సూర్యప్రకాష్‌, లోక్‌స‌త్తా పార్టీ నేత బ్రహ్మేశ్వర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయ‌కుడు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ‌, టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు, రెవరెండ్ దేవ సహాయం, క‌ల్కూర చంద్రశేఖ‌ర్‌తో క‌లిసి టి.జి భ‌ర‌త్ నామినేష‌న్ ప‌త్రాలు రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు.అనంత‌రం మీడియాతో టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ఎన్డీయే కూట‌మి అభ్యర్థిగా పోటీ చేస్తున్న త‌న‌ను ఆశీర్వదించేందుకు ప్రజ‌లు త‌రలిరావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఐదేళ్ల పాటు ప్రజ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నార‌న్నారు. మంచి చేసే నాయ‌కుడిని, ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల‌న్న త‌ప‌న ప్రజ‌ల్లో ఉంద‌ని తెలిపారు. స్వచ్ఛందంగా త‌ర‌లివ‌చ్చిన జ‌న సునామీని చూస్తుంటే భారీ విజ‌యం త‌ధ్యమ‌ని స్పష్టంగా అర్థమ‌వుతోంద‌న్నారు. క‌ర్నూల్లో ప‌దేళ్లుగా తాము ప‌వ‌ర్‌లో లేక‌పోయినా ప్రజా సేవ‌లో ఉన్నామ‌ని తెలిపారు. ఈ ఐదేళ్ల పాలన‌లో ఏ వీధికి వెళ్లినా స‌మ‌స్యలే ఉన్నాయ‌ని పేర్కొన్నారు. తెదేపా సూప‌ర్ 6 ప‌థ‌కాల‌తో పాటు త‌న ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి క‌ర్నూలు ప్రజ‌ల క‌ష్టాలు తీరుస్తాన‌ని భ‌ర‌త్ హామీ ఇచ్చారు. ఒక్క అవ‌కాశం అంటూ 2019లో గెలిచిన వైసీపీ ఐదు సంవ‌త్సరాల కాలంలో అన్ని వ‌ర్గాల‌ను ఇబ్బందుల‌కు గురిచేసింద‌న్నారు. అన్నీ గ‌మ‌నించిన ప్రజ‌లు ఈ సారి త‌మ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. ముస్లింలు ఎవ్వరూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. బీజేపీతో టిడిపి క‌లిసి ఉన్న ఐదేళ్ల కాలంలో రంజాన్ తోఫా, దుల్హన్ ప‌థ‌కం అంద‌రికీ అందించినట్లు వివ‌రించారు. ఈ ఐదేళ్లలో ముస్లింల కోసం ఈ సంక్షేమ ప‌థ‌కాలు ఎందుకు కొన‌సాగించ‌లేద‌ని ఆయ‌న ప్రశ్నించారు. కులం పేరుతో ఓట్లు అడిగే వైసీపీని ప‌క్కన‌పెట్టి.. ఎలా అభివృద్ధి చేస్తామో చెబుతూ ఓట్లు అడుగుతున్న మమ్మల్ని ప్రజ‌లు న‌మ్ముతున్నార‌ని తెలిపారు. తాను గెలిచిన త‌ర్వాత ఐదేళ్ల‌లో క‌ర్నూల్ ప్రజ‌ల త్రాగునీటి స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కారం చూపుతాన‌న్నారు.

టి.జి భ‌ర‌త్ ర్యాలీకి క‌దిలొచ్చిన క‌ర్నూలు

పెద్ద మార్కెట్ నుండి కొండారెడ్డి బురుజు, జిల్లా కోర్టు, కొత్తపేట నాలుగు రోడ్లు, శ్రీ ల‌క్ష్మి స్కూల్ మున్సిపల్ ఆఫీసు స‌మీపం వ‌ర‌కు ర్యాలీ సాగింది. భారీ జ‌న సందోహం మ‌ధ్య టి.జి భ‌ర‌త్ చైత‌న్యర‌థం ఎక్కి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభం నుండి చివ‌రిదాకా ప్రజ‌లంద‌రూ టి.జి భ‌ర‌త్ వెంటే ఉన్నారు. టిడిపి, జ‌న‌సేన‌, బీజేపీ, లోక్‌స‌త్తా, ఎమ్మార్పీఎస్ నాయ‌కులు, కార్యక‌ర్తలు పెద్ద ఎత్తున ర్యాలీకి త‌ర‌లివ‌చ్చారు. టి.జి భ‌ర‌త్ దారి పొడ‌వునా ప్రతి ఒక్కరికీ న‌మ‌స్కరిస్తూ ముందుకు సాగారు. నాయ‌కులు, అభిమానులు ప్రధాన కూడ‌ళ్ల వ‌ద్ద గ‌జ‌మాల‌లు వేసి, టెంకాయ‌లు కొట్టి టి.జి భ‌ర‌త్‌కు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు. దారి పొడ‌వునా కార్యక‌ర్త‌లు, అభిమానులు నీరాజ‌నాలు ప‌లికారు. ఎండ‌ను సైతం లెక్కచేయ‌కుండా మ‌హిళ‌లు ర్యాలీలో పాల్గొని టి.జి భ‌ర‌త్‌కు మద్దతు తెలిపారు. ఈ ర్యాలీలో టి.జి భ‌ర‌త్ కుమారుడు టి.జి విభు ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిచారు. ర్యాలీలో భాగంగా నేత‌లు అంబేద్కర్ విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ ర్యాలీలో మాజీ రాజ్యస‌భ స‌భ్యులు, బీజేపీ నేత టి.జి వెంక‌టేష్‌, టిడిపి ఎంపీ అభ్యర్థి బ‌స్తిపాటి నాగ‌రాజు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు, జ‌న‌సేన ఇంచార్జి అర్షద్, బీజేపీ క‌న్వీన‌ర్ సూర్యప్రకాష్‌, కార్పోరేట‌ర్లు, మాజీ కార్పోరేట‌ర్లు, వార్డు ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, టి.జి అభిమానులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author