తెలుగు ప్రజల జీవనాడి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్
1 min readపోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు ఎక్కడా కనబడదు
నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అని అటువంటి బహుళార్ధసాధక ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సైట్ ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సహచర మంత్రులు ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ చైనా లోని త్రీ గోర్జెస్ కన్నా ఎంతో గొప్పదని, త్రి గోర్జెస్ కన్నా అధిక స్థాయిలో నీటి విడుదల సామర్ధ్యం గల ప్రొజెక్టన్నారు. 194 టి ఎం సి ల నీటి నిల్వ సామర్ధ్యం, 320 టి ఎం సి ల వరకు వరద నీటిని వినియోగించుకోగలిగిన అవకాశం ఉన్న ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. తాను నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేశానన్నారు. పోలవరం ప్రాజెక్టుపై 100 కి పైగా సమీక్షలు, 31 సార్లు క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించామని, పోలవరం ప్రాజెక్ట్ తో తనకు అంత అనుబంధం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రంలో ఎక్కడా కరువు కనపడదన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి 13 వేల 683 కోట్ల రూపాయలు ఖర్చుచేసి, 72 శాతానికి పైగా పూర్తి చేశామన్నారు. అదే వేగంతో పనులు పూర్తి చేసి ఉంటె 2020 చివరి నాటికే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండేదన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపివేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ కి 7100 కోట్ల కు కేటాయింపులు తగ్గించి, అదికూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ లుగా చెల్లించారనన్నారు. తమ హయాంలో 446 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ నిర్మించామని , గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయనీయకుండా కాంట్రాక్టర్ ను మార్చడం, అప్పటివరకు పనిచేసిన ఇంజనీరింగ్ సిబ్బందిని అందరినీ మార్చివేసానన్నారు. కాంట్రాక్టర్ ను మార్చవద్దని, ఇంజనీరింగ్ అధికారులను మార్చవద్దని కేంద్ర జలసంఘం అధికారులు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం మార్చిందన్నారు. 2019, 2020 లో వచ్చిన అధిక వర్షాల కారణంగా డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతిన్నదని, డయాఫ్రమ్ వాల్ మరమ్మతుకు 447 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, అయినప్పటికీ పూర్తిగా మరమత్తు అవుతుందని నమ్మకం లేదని, డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా కొత్తగా నిర్మించేందుకు 996 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికారులు తెలియజేస్తున్నారన్నారు. ఇందుకోసం 4 సీజన్లు అనగా 4 సంవత్సరాల సమయం పడుతుందని అధికారులు తెలియజేస్తురన్నారు. వేల కోట్లాది రూపాయల ప్రజా దానం వృధా చేశారన్నారు. ఇలా గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు పోలవరం ప్రాజెక్ట్ పాలిట శాపాలుగా మారాయన్నారు. రాజకీయాలకు పనికిరని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం రాష్ట్రానికి ఎలా శాపంగా మారుతాడో నన్నది గత ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మిగులుతాడన్నారు. ఇన్ని క్షమించరాని తప్పిదాలు చేసిన గత ప్రభుత్వాన్ని ఎం చర్యలు తీసుకోవాలి అన్నది ప్రజలు తెలియజేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను ఎంత సంక్లిష్టం చేయాలో.. అంతా చేసి ప్రాజెక్ట్ ను పనికిరాకుండా చేశారన్నారు. ఇది క్షమించరాని నేరమన్నారు. రాష్ట్ర మంత్రులు డా. నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ , శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, సొంగా రోషన్ కుమార్, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రు, వసంత కృష్ణ ప్రసాద్, నిమ్మకాయల చైనా రాజప్ప, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఏం. వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, ప్రభృతులు పాల్గొన్నారు.