చిన్న చిన్న కారణాలతో పోస్టల్ బ్యాలెట్ లను తిరస్కరించరాదు..
1 min readఎన్నికల సంఘానికి ఆపస్ వినతి
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఈసారి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసినందున చిన్న చిన్న కారణాలతో పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించవద్దని, బ్యాలెట్ చూసి బ్యాలెట్ లో తప్పు ఉన్నట్లయితేనే తిరస్కరించాలని లేకుంటే ఓటు సక్రమమైనట్లు గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ కుమార్ కుమార్ అన్నారు. ఒంగోలులో జరిగిన ఆపస్ జిల్లా కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కమ్మ మల్లికార్జునరావు మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో విధులు సక్రమంగా నిర్వహించుకొని సిబ్బంది అంతా క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. అలాగే రాబోవు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పుస్తకాలు మారినందున పరీక్షా పేపర్ల మోడల్ కూడా తెలియజేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ వేయడానికి గడువు పెంచాలని కోరారు. ఇతర జిల్లాలలో ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళని వారికి అందుబాటులో గల ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలని, కొంతమందికి ఎన్నికల ఉత్తర్వులు ఇటీవల జారీ చేసినందున వారు తిరిగి ఓటు హక్కు పొందడానికి సమయం ఇవ్వాలని, వారు కూడా ఓటు వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పుస్తకాలు అన్ని ఇచ్చేలా చూడాలని విద్యా కానుక కూడా ముందుగానే సిద్ధం చేసి ఇవ్వాలని ప్రతి పాఠశాలకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు కూడా ఉండాలని కోరారు ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు గుణ ప్రసాద్, చంద్రశేఖర్, లక్ష్మీ నారాయణ, నరసింహారావు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.