తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు
1 min read– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు మాట్లాడే వారంతా ఒకటిగా ఉండాలని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక పూల బజార్ నందు ఉన్న ఆయన విగ్రహానికి టీజీ వెంకటేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి కోసం ఆత్మ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు లభించాల్సిన అంత గౌరవం లభించలేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని, గౌరవించే విధంగా ఈ రోజును ఆత్మార్పణ దినోత్సవం గా జరపాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. పొట్టి శ్రీరాములు భౌతికంగా మన మధ్యన లేకపోయినప్పటికీ, తెలుగు మాట్లాడే వారందరికీ ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని టీజీ వెంకటేష్ అన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా చెన్నైలో ఉన్న ఆయన ఇంటిని గ్రంథాలయం లేదా మ్యూజియం లాంటి స్మారక చిహ్నంగా మార్చి, అందుకు అవసరమైన నిధులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందించాలని టీజీ కోరారు. పొట్టి శ్రీరాములు సేవలను అటు తమిళనాడు ప్రభుత్వం కానీ, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు కనుక చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చొరవ చూపాలని ఆయన కోరారు. అలాగే పొట్టి శ్రీరాములు వారసులు ఎవరైనా ఉన్నా వారిని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని టీజీ వెంకటేష్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యల ఆదరాభిమానాలను పొందాడన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉందని కొత్తగా ఎవరి పేరునైనా పెట్టాలనుకుంటే మరొక యూనివర్సిటీ ని ఏర్పాటు చేసి వారి పేరు పెట్టాలి గాని, శ్రీరాములు గారి పేరు తీసేయకూడదని టీజీ కోరారు. యూనివర్సిటీకి ఆయన పేరు కొనసాగిస్తే ఆర్యవైశ్యులు మరింతగా అభిమానించే వ్యక్తి రేవంత్ రెడ్డి అవుతారని టీజీ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్యవైశ్యుల పట్ల చాలా సానుకూల ధోరణితో అభిమానంతో ఉన్నారని, ఆర్యవైశ్యులు అంటే కష్టించి పని చేసే వారిని ఆయన అనడం ఆర్యవైశ్య పట్ల ఆయనకున్న అభిమానానికి నిదర్శనం అన్నారు. నూటికి నూరు శాతం కష్టపడి సంపాదించే గుణం ఉన్న ఆర్యవైశ్యులకు ఎటువంటి కష్టం వచ్చినా, తన దృష్టికి తెస్తే ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని టీజీ వెంకటేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, ఇల్లూరు లక్ష్మయ్య, మహేష్ శేషగిరి శెట్టి, విఠల్ శెట్టి, వాయుగండ్ల సుబ్బారావు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.