డయేరియా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి
1 min readడయేరియా సమస్యతో మరణించిన కుటుంబాన్ని
పరామర్శించిన ఐటిడిఎ కె.ఆర్.పురం ప్రాజెక్ట్ ఆఫీసరు యం. సూర్యతేజ
గ్రామంలో త్రాగునీరు కోసం చేతిపంపు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు
కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలని గ్రామస్తులకు సూచన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కుక్కునూరు మండలంలోని దామర్లచర్ల పంచాయితీ కుడుములతోబు గ్రామంలో డయేరియా సమస్యతో చనిపోయిన వారి కుటుంబాన్ని గురువారం ఐటిడిఎ కె.ఆర్. పురం ప్రాజెక్ట్ ఆఫీసరు యం. సూర్యతేజ పరామర్శించారు. సదరు గ్రామంనందు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించి గ్రామంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యసేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందకుండా శానిటేషన్ మెరుగుపరివిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ గ్రామంలో త్రాగునీరు ఏర్పాటుకోసం చేతిపంపును యుద్ధప్రాతిపధికన ఏర్పాటు చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మొత్తం గ్రామాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామ ప్రజలందరూ పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన మంచినీటిని తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. గ్రామంలో ఎవరికైనా ఆరోగ్య పరమైన సమస్య వస్తే వెనువెంటనే మెడికల్ క్యాంపుకు వచ్చి వైద్య సేవలు పొందాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు. వీరి వెంట డి యం హెచ్ వో డా.ఏస్.శర్మిష్ట తదితరులు ఉన్నారు.