విశాఖ “స్టీల్ ప్లాంట్” ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
1 min readరైతు, కార్మిక సంఘాల డిమాండ్ (AITUC, AIKS )
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద ఏపీ రైతు సంఘాలు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో రాస్తారోక కార్యక్రమం చేపట్టారు. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం పత్తికొండలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల మండపం వద్ద రాస్తో రోకో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి రాజా సాహెబ్ మాట్లాడుతూ, విశాఖ ఆంధ్రుల హక్కుగా భావిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించు కోవాలని కోరారు. లేనిపక్షంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. దాదాపు అరగంట పాటు నాలుగు స్తంభాల కూడలి వద్ద ఏపీ రైతు సంఘం ట్రేడ్ యూనియన్ల నాయకులు ఆందోళనలు చేపట్టడంతో ట్రాఫిక్కుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తాసిల్దార్ వెంకటలక్ష్మికి అందజేశారు.