కల్తీ విత్తనాల నుండి రైతులను కాపాడాలని వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కల్తీ విత్తనాల నుండి రైతులను కాపాడాలి పత్తి, ఆముదం, ఆమిరప, కంది, మొక్కజొన్న వంటి విత్తనాలను సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలని కోరుతూ వినతి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ముందస్తు వర్షాలతో జిల్లాలో రైతులు పత్తి, వేరుశనగ, మిరప, ఆముదం, మొక్కజొన్న, కంది వంటి పంటలను సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గత రెండు సంవత్సరాల్లో కావేరి జాదు మరియు కొన్ని విత్తన కంపెనీలు సరఫరా చేసిన కల్తీ విత్తనాలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. 2021 ఖరీఫ్ లో కావేరి జాదు విత్తన కంపెనీ చేతిలో నష్టపోయిన 1,899 మంది రైతులకు పంట నష్టపరిహారానికి సంబంధించి అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలు కాలేదు. రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు.గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల 30 నుండి 40 శాతం మేర పంటలు సాగు కాలేదు. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ సంవత్సరం ముందస్తు వర్షాలతో ఖరీఫ్ ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, వేరుశనగ, వరి, ఆముదం, మొక్కజొన్న, మిరప, కంది వంటి పంటలు ప్రధానంగా సాగు చేస్తారు. కాని వేరుశనగ, జీలుగ, పిల్లి పెసర వంటి విత్తనాలను సబ్సిడీతో రైతులకు సరఫరా చేస్తున్నట్లు మీరు ప్రకటించారు. రైతులకు అవసరమైన విత్తనాలను సబ్సిడీతో సరఫరా చేయాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.60 లక్షల హెక్టార్లకు పైగా పత్తి సాగు చేస్తారు. వేరుశనగ 60 వేల హెక్టార్లు, కంది 25 వేల హెక్టార్లు, మిరప 30 వేల హెక్టార్లు, ఉల్లి 16 వేల హెక్టర్లు, మొక్కజొన్న 9 వేల హెక్టార్లు సాగు అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న పత్తి, మిరప, కంది, మొక్కజొన్న, ఆముదం వంటి విత్తనాలను సబ్సిడీతో సరఫరా చేయదంవలన రైతులకు ప్రయోజనకరంగాఉంటుంది. కాబట్టి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు అవసరమైన పత్తి, మిరప, కంది, ఆముదం, మొక్కజొన్న వంటి విత్తనాలను రైతులకు సబ్సిడీతో ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో పత్తి విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి మోసం చేసే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమై విత్తనాల షాపులు, విత్తన కంపెనీల గోడౌన్ లు తనిఖీ చేసి నకిలీ విత్తనాలను అరికట్టవలసిందిగా, మోసాలకు పాల్పడుతున్న విత్తన కంపెనీలు, విత్తన షాపులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పత్తి సాగు పట్ల రైతులలో ఉన్న ఆసక్తిని అవకాశంగా తీసుకుని విత్తనాల షాపుల యజమానులు నిర్ణయించిన గరిష్ట ధరల కంటే అదనపు ధరలకు రైతులకు విత్తనాలను అమ్ముతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు పట్టణాల్లో కొన్ని దుకాణాల యజమానులు ఈ రకమైన అక్రమాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక వ్యవసాయ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి అక్రమాలను అరికట్టి రైతులకు అండగా నిలవాల్సిందిగా కోరుచున్నాము.