కృష్ణా, గోదావరి నీటి హక్కులను పరిరక్షించండి
1 min readరైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కృష్ణా, గోదావరి నది జలాల పంపిణీ ద్వారా రాష్ట్రానికి సంక్రమించిన నీటి హక్కులను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కృష్ణా గోదావరి నదీ జలాల రాష్ట్ర నీటి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం డేగా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల రెండో వారంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కోరిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన నివేదిక ద్వారా వాదనను పటిష్టంగా వినిపించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వంలోని జలశక్తి విభాగం గత సంవత్సరం అక్టోబర్ 6న గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని,రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల నుంచి తమకు కేటాయించాల్సిన నీటి హక్కులను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలను వినిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం, విభజన చట్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాన్ని ట్రిబ్యునల్ ముందు నివేదించాలని డిమాండ్ చేశారు.నీటి పంపిణీపై ఉభయ రాష్ట్రాల మధ్య ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల త్రాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేసే ఏర్పాటు చేయాలని, నీటికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించేందుకు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సాగునీటి రంగ నిపుణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.