ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
1 min readజిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే డెలివరీ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ చిన్నచిన్న కారణాలతో గర్భిణీ స్త్రీలను వెనక్కి పంపకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పిహెచ్సి, సిహెచ్సి లలో వైద్య సేవలు మెరుగుపడాలని కలెక్టర్ ఆదేశించారు. ఓపి సంఖ్య పెరగడంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. మాతృ శిశు మరణాలు సున్నా స్థాయికి చేరుకునేలా వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలలో పౌష్టికాహారాన్ని పెంచడంతోపాటు రక్తహీనతను అధిగమిచ్చేందుకు స్త్రీ శిశు సంక్షేమ అధికారులను సమన్వయ పరచుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో ఎన్టీఆర్ వైద్య సేవలు మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గుండె సంబంధిత చికిత్సలు, ఇంజక్షన్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందులు, ఇతర వృధా పరికరాలను టెండర్లు పిలిచి వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో వెంకటరమణ, డిసీహెచ్ఎస్ ఝాఫ్రూళ్ల, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్డెంట్ తదితరులు పాల్గొన్నారు.