రాష్ట్రంలో కొత్తగా 1400 ఆర్టీసీ బస్సులు కొనుగోలు
1 min readప్రయాణీకులకు భద్రత, సుఖప్రయాణం ప్రాధాన్యత ఇస్తున్నాం
ప్రయాణీకులు,కార్మికులు ప్రభుత్వానికి రెండు కళ్ళు
రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ఆర్టీసీ కి 1400 కొత్త బస్సులు కొనుగోలుచేశామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. స్థానిక ఆర్టీసీ బస్సు డిపో లో గురువారం విజయవాడ జోన్ 2 కు సంబందించిన 26 స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ని మరింత బలోపేతం చేస్తామని, ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందిస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రయాణీకులు కార్మికులు రెండు కళ్ళు లాంటి వారని, కార్మికుల, ప్రయాణీకుల క్షేమం తమకు ముఖ్యమన్నారు. గత ప్రభుత్వం గత ఐదేళ్ళలో ఆర్టీసీకి ఒక్క బస్సు ను కూడా కొనుగోలు చేయలేదన్నారు. ప్రయాణీకుల భద్రతకు, సుఖవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇచ్చి కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. సిబ్బంది కూడా ప్రయాణీకులు అధికంగా ప్రయాణించి ఆక్యుపెన్సీ రేషియో పెరిగేలా పనిచేయాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తోందని, ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పేదలకు పెన్షన్లను ఒకటవతేదీనే వారి ఇంటివద్దకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా 16 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ ప్రకటించడం జరిగిందన్నారు. ఈనెల 15వ తేదీ నుండి రాష్ట్రంలో మొదటిదశలో అన్నా క్యాంటిన్లు ప్రారంబిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదన్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించదగిన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రజారవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాధరెడ్డి, ఉప రవాణా కమీషనర్ ఎస్. శాంతకుమారి, ఏలూరు ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి, ఏలూరు,తూర్పుగోదావరి, కాకినాడ,కృష్ణా జిల్లాల ప్రజా రవాణాధికారులు ఎన్ .వి.ఆర్. వరప్రసాద్, షర్మిల, శ్రీనివాసరావు, వాణి , ఏలూరు డిపో మేనేజర్ వాణి , ప్రభృతులు పాల్గొన్నారు.