రవీంద్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం(రవీంద్రియన్స్ డే)
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర డిగ్రీ కళాశాలలో నేడు రవీంద్రియన్స్ డే పేరుతో వార్షికోత్సవం నిర్వహింపబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీమతి ఎం. గీతశ్రీ (సీనియర్ కన్సల్టెంట్ ఎంటర్ప్రైజెస్ డెవలప్ మెంట్, ర్యాంప్ వల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ తెలంగాణ) మరియు రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా గీతశ్రీ మాట్లాడుతూ నేడు విద్యార్థులు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువ సమయాన్ని వృధా చేస్తూ, కోచింగ్ సెంటర్లలో కాలయాపన చేస్తున్నారన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు మీకు ఉన్నటువంటి మేధస్సును దృష్టిలో ఉంచుకొని ఇన్నోవేషన్ ఐడియాలతో మీరు ముందుకు వస్తే ,ఆ ప్రాజెక్టుకు తగినటువంటి ఆర్థిక సహాయాన్ని కానీ మీ ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోవడానికి కానీ మా వైపు నుండే కాక ప్రభుత్వం నుండి కూడా గుర్తింపు పొందేలాగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. అనంతరం రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్య ఆవశ్యకతను గుర్తుతెరిగి 30 సంవత్సరాల క్రితమే మహిళా డిగ్రీ కళాశాలను స్థాపించడం జరిగిందన్నారు .నేడు ప్రతి రంగంలోనూ స్త్రీలు ముందడుగు వేస్తున్నారని గుర్తు చేశారు. సమాజంలో మహిళలకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు మనకు ఉన్నటువంటి అవకాశాలు అన్నింటిని అందిపుచ్చుకొని రాబోవు తరాలకు స్ఫూర్తిగా నిలిచే సరికొత్త ఆలోచనలను ఆవిష్కృతం చేయాలని ఆకాంక్షించారు. కళాశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలలోను, కార్పొరేట్ కంపెనీలలోనూ స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు .వారి సూచనలు కూడా విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ మరియు అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ , కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జ్యోతి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.