రాహుల్ కు ఒంటబట్టని భారతీయత జంటవీడని ఇటలీయత
1 min readవి.హెచ్.పి.రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వకళ్యాణ కారకమై సనాతన ధార్మిక సంస్కృతిగా సమ భావము, సహకారము విలువలతో శోభిల్లే హైందవ సంస్కృతిని కించపరిచే విధంగా హిందుత్వం అన్నా, హిందూ ధర్మానుసరణీయులన్నా హింసావాదులు అని కించపరిచేలా విపక్ష నేత రాహుల్ గాంధీ పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా పేర్కొనటం గర్హనీయమని ఇది వారికి వంట బట్టని భారతీయతను జంట వీడని ఇటలీయతను తెలియజేస్తున్నదని దక్షిణాంధ్రప్రదేశ్ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి నిరసించారు. కర్నూలు పాతపట్నం లోని జమ్మి చెట్టు వద్ద గల శ్రీ లలితా పీఠంలో పీఠం వ్యవస్థాపకులు మేడా సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో నందిరెడ్డి సాయిరెడ్డి అధ్యక్షతన నాలుగవ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆశీః ప్రసంగం చేసిన అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామీజీ మాట్లాడుతూ “జన్మతః హిందువులమైన మనమందరము హైందవ విలువలతో జీవించటం అత్యంత అవసరమని, అదే విధంగా హిందూ ధర్మ పరిరక్షణకు , బాలబాలికల్లో హిందుత్వ భావజాల వ్యాప్తి చేయటానికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన దక్షిణాంధ్రప్రదేశ్ విశ్వహిందూ పరిషత్ రాష్ట్రకార్యదర్శి కాకర్ల రాముడు మాట్లాడుతూ “భారతీయత అనేది సర్వోతృష్టమైన జీవన విధానమని, భారతీయులుగా జన్మించినందుకు మనం గర్వించాలని, హిందూ సంప్రదాయాలను ఆచరించడం గౌరవించడం మనందరి కర్తవ్యం కావాలని, మన ఉత్సవాలు మన పండుగలు మన ఆచారాలను తప్పక శాస్త్రోక్తంగా ఆచరించాలని, ముఖ్యంగా ఉత్సవ సమయాలలో పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టరాదని, వాటి కారణంగా మన సంప్రదాయాలపై ప్రజలకు విశ్వాసం పోయే అవకాశం ఏర్పడుతుందని” ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన వాడవాడల్లో దేవాలయాలు కేంద్రంగా హిందుత్వ పరిరక్షణకు, మన ఆచార వ్యవహారాల కొనసాగింపుకు తగిన ప్రణాళికా బద్ధమైనటువంటి కృషి అందరూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని” ఉద్బోధించారు. కార్యక్రమంలో బ్రహ్మంగారిమఠం శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదవ తరం ముని మనవడు శ్రీ నొస్సం వీరంభట్లయ్య స్వామి, చిన్నటేకూరు సద్గురు నాగలింగేశ్వర జీవైక్య మఠం మఠాధిపతులు శ్రీ ఎల్లప్ప స్వామి, జూటూరు గురుసిద్ధ నాగసాయి బ్రహ్మ విద్యాశ్రమం పీఠాధితతులు సద్గురు రామానంద స్వాముల వారు, ఇస్కాన్ సంస్థ కర్నూలు బాధ్యులు శ్రీ రఘునందన్ సేవాదాస్ జీ , గోదాగోకులం వ్యవస్థాపకులు మారం నాగరాజు గుప్త, తెలుగు భాషా వికాస ఉద్యమం వ్యవస్థాపకులు జే.ఎస్.ఆర్.కే. శర్మ ,తరిగొండ వెంగమాంబ సేవాసమితి అధ్యక్షులు పి. నీలిమ, సభ్యులు డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని ప్రభృతులు పాల్గొని హిందూ ధర్మ పరిరక్షణకు వారు చేస్తున్న కృషిని మరియు భవిష్యత్తులో సమిష్టిగా అన్ని సంస్థలు చేయవలసినటువంటి కార్యక్రమాలకు కావలసినటువంటి సలహాలు, సూచనలను అందించారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ తొగట సురేశ్ బాబు వ్యవహరించారు. ఈ సమ్మేళనంలో జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వందకు పైగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.