కోల్కత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన సిగ్గుచేటు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచార,హత్య ఘటన నేటి సభ్య సమాజానికి తలదించుకునేలా, దేశానికి తీరని మచ్చలా మిగిలిపోతుందని స్థానిక డాక్టర్లు వైద్య సిబ్బంది వాపోయారు. శనివారం కోల్కత్తా ట్రైన్ ఏ డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా పత్తికొండలో డాక్టర్లు వైద్య, ఆరోగ్య సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. స్థానిక గెస్ట్ హౌస్ నుండి నాలుగు స్తంభాల కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు బొంతల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఇంత అభివృద్ధి చెందిన నవ నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మానవ సమాజానికి తలవంపులను అన్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వాలు కఠినమైన శిక్షలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాణాలను రక్షించే డాక్టర్లు మానవ మృగాల ఆకృత్యాలకు లోనైతే, మామూలు మనుషులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. డాక్టర్లు విధుల నిర్వహణలో పలు దఫాలుగా దాడులకు గురవడం దారుణమన్నారు. విధులు నిర్వహించే డాక్టర్లకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలని సూచించారు. ప్రాణాలు పోసే డాక్టర్లను రక్షించాలి, డాక్టర్ల సంరక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు, ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కోరారు. ట్రైన్ డాక్టర్ అత్యాచారం హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ఆరోగ్య వైద్య సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు.