రాయలసీమ సమాజం జాగృతం అవ్వాలి
1 min readప్రజలకు పిలుపునిచ్చిన బొజ్జా దశరథరామిరెడ్డి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యుత్ నియంత్రణ కమీషన్ ( ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) కార్యాలయ ప్రారంభోత్సవం గురువారం నాడు కర్నూలులో చేపట్టడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నంద్యాల సమితి కార్యాలయంలో శుక్రవారం పత్రికా ప్రకటనను బొజ్జా విడుదల చెసారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ కార్యాలయాన్ని కర్నూలు లోనే ఏర్పాటు చేయాలని సమితి డిమాండ్ చేసిన విషయాన్ని దశరథరామిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత హడావిడిగా విద్యుత్ నియంత్రణ కార్యాలయ ప్రారంభోత్సవం చేపట్టడం ఎందుకు అని కోస్తాంధ్ర నాయకులు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది అని బొజ్జా పేర్కొన్నారు. “ఇంత హడావిడి ఎందుకు” అనే ప్రశ్న లేవనెత్తడం, విద్యుత్ నియంత్రణ కార్యాలయాన్ని కూడా విజయవాడకు తరలించాలన్న వారి దుర్బుద్ధికి నిదర్శనం అని ఆయన తీవ్రంగా స్పందించారు. 10 సంవత్సరాల పాటు రాజధాని హైదరాబాదులోనే కొనసాగించే అవకాశం ఉన్న రాజధాని విజయవాడ కేంద్రంగా తరలించినప్పుడు కోస్తాంధ్ర నాయకులు “ఇంత హడావిడిగా” తరలింపు ఎందుకు అని ప్రశ్నించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాల్సి ఉంటే రాజధాని తరలించిన పాలకులు ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినా హైకోర్టును విజయవాడలో తరలించిన సందర్భంలో ఈ కోస్తాంధ్ర నాయకుల గొంతులు ఎందుకు మూగపోయాయని ఆయన ప్రశ్నించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడే ప్రభుత్వం హైకోర్టును, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు విధానపరమైన నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కర్నూలును సీడ్ హబ్ గా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ, విత్తన దృవీకరణ సంస్థ ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. సార్వత్రిక ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపిన రాయలసీమ సమాజం, ఇక రాజకీయాలకు అతీతంగా రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై జాగృతం కావాలని ఆయన కోరారు. రాయలసీమ అభివృద్ధి అంశాలపై నిశితమైన దృష్టిని సారించాలని, ఆ దిశగా పాలకులపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపట్టాలని రాయలసీమ ప్రజలకు బొజ్జా విజ్ఞప్తి చేసారు.