చరిత్రలో గుర్తుండిపోయే విధంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా..
1 min readఎస్సీ సంఘాల నాయకులకు భరోసా
మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ సమస్యకు పరిష్కారం చేస్తా
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజాపాలనలో 4 తరాల చరిత్రవున్న బడేటి కుటుంబం కులముద్రకు అతీతమైందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. చరిత్రలో గుర్తుండిపోయే విధంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి నిత్యం అనేక మంది ప్రజలు, అధికారులు, వివిధ సంఘాల నేతలు వస్తూ ఉంటారు. ప్రజా సమస్యలకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇస్తోన్న ప్రాధాన్యతాక్రమం అటువంటిది మరీ. అందుకే అత్యంత తక్కువకాలంలోనే అనేక మేజర్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాయి. దీంతో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చేందుకు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా గురువారం ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వారితో మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంఘ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ సమస్యను ఆయన దృష్టికి సంఘాల నేతలు తీసుకెళ్ళగా సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసాఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజాభిమానాన్ని చూరగొనాలనే ఆశా, ఏలూరును అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష తప్ప వేరే ఏ ఆలోచనలు తనకు ఉండవని స్పష్టం చేశారు. కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తేనే ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతామన్న ఆయన,, పెండింగ్ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానన్నారు. చరిత్రలో గుర్తుండిపోయే సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, దాసరి ఆంజనేయులు, ఎస్సీ సంఘాల ప్రముఖులు చాగంటి సంజీవ్, డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, పాము శామ్యూల్, దాసరి రమేష్ కుమార్, మాణిక్యాలరావు, నేతల రమేష్‌బాబు, పల్లెం ప్రసాద్, మెండెం ఆనంద్, కాపుదాస్ రవి, దాసరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.