శ్రీ మద్ది ఆంజనేయ స్వామికి నిత్యార్చన పూజలు
1 min readప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం
కార్యనిర్వహణాధికారిణి ఆర్ వి చందన
వివిధ సేవల రూపేణ రూ:1,16,269/- లు ఆదాయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తమలపాకులతో విశేష పూజలు జరిగాయి. మంగళవారం కావడంతో దర్శనాలకు విచ్చేసిన భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులు శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ స్వామి తమ కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తులు కొలుస్తారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు చేయించుకున్నారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ 1,16,269/-లు సమకూరినది. సుమారు 1200 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయమువద్ద బొర్రంపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్య సేవలు అందించారు. శ్రీ స్వామివారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన తెలిపారు.