PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలకు..విద్యార్థినీలకు ఇబ్బందిగా మారిన మద్యం దుకాణాన్ని తొలగించండి

1 min read

ఏపీ మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ)

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణలో పెద్ద బావి సమీపంలో ఉన్న మద్యం దుకాణం వల్ల మహిళలు మరియు పాఠశాల విద్యార్థినీలు,కాలనీ మహిళలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారని తక్షణమే నియోజకవర్గ శాసనసభ్యులు బి.వి.జయ నాగేశ్వర్ రెడ్డి  స్పందించి ఆ మద్యం దుకాణాన్ని తీయించి,మహిళలకు మరియు విద్యార్థినీలకు అండగా నిలవాలనిఏపీ మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ)పట్టణ కార్యదర్శి యు.ఈరమ్మ తెలిపారు.అనంతరం సిపిఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యం మద్యం, గంజాయి మత్తులో ఉన్న మానవ మృగాలు ఏదో ఒకచోట మూడేళ్ల చిన్నారి నుండి 60 ఏళ్ల ముసలోళ్ల వరకు అత్యాచారం చేసి,హత్యలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. పట్టణంలో పెద్దబావి దగ్గర ఉన్న మద్యం దుకాణం వల్ల చుట్టుపక్కల కాలనీ మహిళలు, ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని, మద్యం ప్రియులు మద్యాన్ని కొని,పక్కనే ఉన్న కాలనీ మహిళల ఇంటిముందు మద్యం సేవించి, సీసాలను ఇళ్లల్లోకి విసరడం జరుగుతుందని,తాగిన మైకంలో కొంతమంది నగ్నంగా పడిపోవడం వంటివి జరుగుతున్నాయని ఆమె తెలిపారు.అంతేకాకుండా మద్యం దుకాణం వెనక ప్రవేట్ పాఠశాల ఉండడంవల్ల నిత్యం వందలాది మంది విద్యార్థినీలు స్కూలుకు వెళ్ళొస్తూ ఉంటారని,మద్యం ప్రియుల వికృత చేష్టలు చూడలేక కళ్ళు మూసుకుని వెళ్లడం జరుగుతుందని, మద్యం ప్రియుల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని విద్యార్థినీలు పాఠశాలకు వెళ్లడం జరుగుతుందని ఆమె తెలిపారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలంటే పాఠశాలకు మరియు దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలో మద్యం షాపు ఉండాలని ప్రభుత్వం నిబంధన ఉన్నప్పటికీ ఈ మద్యం షాప్  కు విరుద్ధంగా 30 అడుగుల దూరంలో తాయమ్మ గుడి, 100 అడుగుల దూరంలో ప్రవేట్ పాఠశాల ఉందని అలాంటప్పుడు ఈ మద్యం దుకాణానికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారని,కాబట్టి తక్షణమే ఈమధ్యం దుకాణాన్ని తొలగించి,ఆ ప్రాంత మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో వానీమ్మ,పద్మ, ఈరమ్మ,శారద పాల్గొన్నారు.

About Author