రాయలసీమ అభివృద్ధి అంశాలపై ప్రభుత్వానికి ప్రజా సంఘాల నివేదిక “
1 min readకర్నూల్ లో సీమ నాలుగు జిల్లాల నాయకుల సమావేశం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై నూతన ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను అందచేయనున్నట్లు రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు. ఆదివారం కర్నూలు నగరంలోని డా. బ్రహ్మారెడ్డి ఆసుపత్రి సమావేశ మందిరం లో నాలుగు జిల్లాల ఉద్యమ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కల వేదిక కన్వీనర్ రామకృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. జూలై మొదటి వారంలో ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, ఇతర అధికారులను కలిసి రాయలసీమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకు సమస్యలకు సంబంధిన సమగ్ర నివేదికను సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగులు ఉండేలాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు రూపొందించిన రూల్ కర్వ్ ను అమలుపరచాలని, విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలనీ, ఎన్నికల సందర్భంగా రాయలసీమ ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలనీ, రాయలసీమ సాగునీటి హక్కులను కాలరాచేలాగ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం అక్టోబర్ లో తీసుకొని వచ్చిన రాజ్యంగ విరుద్ధ చట్టాన్ని రద్దుచేయాలని, బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజిని కరువుపీడిత రాయలసీమకు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అలాగే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూల్ ఏర్పాటు చేయాలని, చెరువుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయాలనీ, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరారు. రాయలసీమ లో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి కార్యాలయాలను కర్నూల్ లోనే యధావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలను ఎంఎల్ఏ ల దృష్టి కి కూడా తీసుకు వెళ్తున్నామని నాయకులు ప్రకటించారు. ఈ సమావేశంలో వాడాల చంద్ర శేఖర రెడ్డి, డేవిడ్, శ్రీనివాసులు, రామ్ కుమార్( ఓపిడిఆర్), వెంకటేష్, రాహుల్( రాయలసీమ విద్యా వంతుల వేదిక), రత్నం ఏసేపు, సుంకన్న, ప్రతాప రెడ్డి, రామాంజనేయులు ( జన విజ్ఞాన వేదిక) సుబ్బారాయుడు, శేషగిరి, శివశంకర్, గంగి రెడ్డి, రవికుమార్ లు పాల్గొన్నారు.