బాధ్యతగా విధులు నిర్వర్తించండి..
1 min readనిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తప్పవు..
- విద్యార్థులకు విద్య, నాణ్యమైన ఆహారం అందించాల్సిందే..
- మెన్,ఉమెన్ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్యూ ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ ఆచార్య ఎన్టికె నాయక్
కర్నూలు, పల్లెవెలుగు:రాయలసీమ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని, విద్యార్థులకు విద్యతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు ఆర్యూ ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్. ఆదివారం ఉదయం మెన్, ఉమెన్ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న అల్పాహారం పరిశీలించారు. హాస్టళ్లలో నీరు, విద్యుత్ సౌకర్యం సరిగా లేదని, గదులలో నీరు కారుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని, సమయానికి శుభ్రం చేయడంలేదని కొందరు విద్యార్థులు ఇన్చార్జ్ వీసీ ఎన్.టి.కె. నాయక్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అక్కడే ఉన్న అధికారులను, వార్డెన్ల ను ప్రశ్నించారు. విధులకు సమయానికి రావాలని, సమాచారం లేకుండా గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు నీరు, విద్యుత్, బాత్ రూమ్ల శుభ్రత తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. హాస్టళ్లలో సమస్యలు ఇన్ని ఉంటే ఎందుకు పరిష్కరించలేదని సదరు అధికారులపై వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ఆయన మాట్లాడారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరిస్తామని, వసతులు మెరుగు పరుస్తామని, అధికారులకు, వార్డెన్లకు మీరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ ఆచార్య ఎన్టికె నాయక్ విద్యార్థులకు సూచించారు. తనిఖీలో వర్సిటీ చీఫ్ వార్డెన్ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి, వార్డెన్ డా. వై. హరిప్రసాద్ రెడ్డి, డిప్యూటీ వార్డెన్లు, వర్సిటీ ఇంజనీర్ నరసప్ప, సిబ్బంది ఉన్నారు.