సమాచార హక్కుచట్టం అవగాహన కార్యక్రమాల సావనీర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
1 min readసమాచార హక్కుచట్టం పై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు విజయవంతం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో రైతు గ్రూపులకు, రైతులకు సమాచార హక్కుచట్టం అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాచార హక్కుచట్టం-2005 అవగాహన కార్యక్రమాలకు సంబందించి ఫొటోలు, ప్రచురణలతో రూపొందించిన సావనీర్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం-2005 కమీషనరు వారి ఆదేశాలు మేరకు జిల్లాలో మండలస్ధాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సంబంధిత డాక్యుమెంటేషన్ కమీషనరు వారి కార్యాలయానికి సమర్పించడం జరుగుతుందన్నారు. మండలస్ధాయిలో రైతులకు ప్రభుత్వ శాఖల నుంచి అవసరమగు సమాచారం పొందడం గురించి, గడువులోగా సమాచారం రానియెడల అప్పీలు చేసుకొనే విధానం గురించి వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.