గుంతలు లేని రహదారులే.. లక్ష్యం..
1 min readమిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: “మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ ప్రారంభించారు. శనివారం మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 5 రోడ్ల కూడలి (ఆర్.ఎస్. రోడ్డు జంక్షన్ )నందు రోడ్డు మరమ్మతు పనులను మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గుంతల రహదారుల్లో ప్రయాణాలు సాగించలేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అప్పటి ప్రభుత్వం రోడ్లపై గుంతలను పట్టించుకోలేదన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు “మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర ప్రదేశ్” కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని రహదారులు గుంతలుగా లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 8,000 కిలోమీటర్ల రోడ్డులో 290 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. రెండవ దశలో 8,000 కిలోమీటర్ల రోడ్డులో 350 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కర్నూలు జిల్లాలో “మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమము క్రింద మెదటి దశలో 69 పనులను 11.16 కోట్ల వ్యయంతో 412.15 కిలోమీటర్ల ను గుంతల రహిత రహదారులు చేపట్టినట్లు తెలిపారు. రెండవ దశలో 171 పనులు 8.71 కోట్లతో 426.55 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహిత మరియు ముళ్ళ కంప చెట్లు లేని రహదారులుగా డిసెంబర్ నెలలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కర్నూలు టౌన్ 5 రహదారుల కూడలి (ఆర్.ఎస్ .రోడ్డు జంక్షన్) నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమములో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య, ఆర్ అండ్ బి ఎస్.ఈ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, ఆర్ అండ్ బి ఈ.ఈ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.