ఆన్లైన్ ద్వారా ఇసుక బుకింగ్…
1 min readగ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
సులభ తరమైన విధానాలు, పారదర్శకత, జవాబుదారీ తనంతో ఉచిత ఇసుక పంపిణీ
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను ఉచితంగా, సులభంగా బుక్ చేసుకునేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బుకింగ్ పోర్టల్ ను అమలులోకి తీసుకువచ్చిందని.. ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.ఆదివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఇసుక అంశం పై ఎస్పీ జి.బిందు మాధవ్ తో కలిసి కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 8వ తేది నుండి నూతన ఇసుక పాలసీ విధానం ప్రకారం ఇసుకను పంపిణీ చేస్తున్నామన్నారు.ఇసుక పంపిణీ ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లో ఇసుక ను బుక్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. https://www.sand.ap.gov.in/వెబ్సైట్లో ఇసుకను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు… అదే విధంగా గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.జిల్లాలో 5 డీసిల్టేషన్ పాయింట్స్ ఉన్నాయన్నారు..ఇవి ఈర్లదిన్నె, కె.సింగవరం, కొత్తకోట, ముడుమాల, పల్లె దొడ్డి అని తెలిపారు.. వీటి నుండి ప్రతి రోజు దాదాపు 6 వేల మెట్రిక్ టన్నుల దాకా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు..ఆన్లైన్ బుకింగ్ ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ అవుతుందని, ఆన్లైన్ లో 6 వేల మెట్రిక్ టన్నుల దాకా బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.5 డీసిల్టేషన్ పాయింట్స్ లో లక్ష 73 వేల 598 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ తెలిపారు..అదే విధంగా అక్టోబర్ 16 వ తేది నుండి కౌతాళం మండలంలో మరళి లో మాన్యువల్ రీచ్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.మార్చి 2025 వరకు ఇంటికి, ఇతర అవసరాలను తీర్చేందుకు గాను 4 ఓపెన్ ఇసుక రీచ్ లను గుర్తించడం జరిగిందని, వాటికి సంబంధించిన పర్మిషన్ లు, పబ్లిక్ హియరింగ్ లు పెండింగ్ లో ఉన్నాయని, అనుమతులు రాగానే వాటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.ప్రస్తుతానికి 5 డీసిల్టేషన్ పాయింట్స్ లకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్, ట్రాన్స్పోర్టర్స్ తో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో యూనిఫార్మ్ గా వాహనాల రవాణా చార్జీ లను నిర్ణయించడం జరిగిందన్నారు.. 10 కిలోమీటర్ల లోపు ఉంటే ట్రాక్టర్ కి అయితే 13.5 రూపాయలు, 6 టైర్లు ఉన్న వాటికి 10.7 రూపాయలు, అంతకు మించిన టైర్లు కలిగిన వాహనాలకు 9.4 రూపాయలు నిర్ణయించారన్నారు.11 నుండి 20 కిలోమీటర్ల వరకు ఉంటే ట్రాక్టర్ కి అయితే 12.8 రూపాయలు, 6 టైర్లు ఉన్న వాటికి 10.2 రూపాయలు, అంతకు మించి అయితే 8.9 రూపాయలు, 80 కిలోమీటర్లు దాటితే 6 టైర్లు ఉన్న వాహనలకు 3.5 రూపాయలు, అంతకు మించి ఉంటే 3.5 రూపాయలను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ట్రాన్స్పోర్టర్స్ ఈ ధరలకు అంగీకరించి, వారి వాహనాలను రిజిస్టర్ చేసుకోవడం జరిగిందన్నారు.. అలా కాకుండా రవాణా చార్జీలు ఎక్కువ వసూలు చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు… సొంత వాహనాలలో కూడా ఇసుకను తీసుకొని వెళ్ళవచ్చని, అయితే వాటిని రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు..ఇసుక కు పూర్తిగా ఉచితమేనని,కేవలం తవ్వకం ఖర్చు, లోడింగ్, ఆపరేషనల్, సీనరెజెస్, జీఎస్టీ తదితర ఖర్చుల కోసం మాత్రమే అమ్మకపు ధరను రూ.320 లుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇసుక పంపిణీ పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిలో రెవెన్యూ మైనింగ్ రవాణా పోలీస్ శాఖ తదితర అధికారులతో టాస్క్ ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 6042 ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడైనా ఇసుక సమస్య ఉన్నట్లయితే ఈ నెంబర్ కి కాల్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా మెయిల్ ఐడి [email protected] కి ఫిర్యాదు చేయవచ్చన్నారు.. ప్రతి డిసిల్టేషన్ పాయింట్ వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి బుకింగ్ కి సంబంధించి ఇన్వాయిస్ ఉంటుందని, క్యూ ఆర్ కోడ్ రూపంలో స్కాన్ చేయడం జరుగుతోందన్నారు.. తద్వారా వెహికిల్ ను ట్రాక్ చేయవచ్చన్నారు.పోస్ట్ వెరిఫికేషన్ లో భాగంగా బుకింగ్ జరిగిన వాటిలో కొన్నింటిని ర్యాండమ్ గా వెరిఫికేషన్ చేయిస్తున్నామని, అందులో ట్రాన్పోర్ట్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు కలిగించారా ? ఇసుక క్వాంటిటీలో ఏమైనా తప్పుకు జరుగుతున్నాయా అని చెక్ చేయడం జరుగుతోందన్నారు .ఇసుక అక్రమ రవాణా ఎక్కడ కూడా జరగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలకు నిజంగా అవసరం ఉంటే దగ్గరలో ఇసుక అందుబాటులో ఉన్నట్లయితే పంచాయతీ సెక్రెటరీ అనుమతితో ఉచితంగా ఇసుకను తీసుకొని వెళ్లవచ్చునని, అంతే గానీ 20,30 వాహనాల్లో ఇసుకను తీసికెళ్ళి బిజినెస్ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు..అక్రమ రవాణా కు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.. పంచలింగాల, నాగులదిన్నె ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లను నిన్న సీజ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.