ఇసుక ఫ్రీ… ఫ్రీ…
1 min readస్టాక్ పాయింట్ నుండి లోడింగ్, రవాణా చార్జీలు వినియోగదారుడే భరించాలి
ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఈ నెల 8వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోందని, స్టాక్ పాయింట్ నుండి లోడింగ్, రవాణా చార్జీలు వినియోగదారుడే భరించాల్సి ఉంటుందని ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానం అమలుపై అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గనుల శాఖ ఏడి రామచంద్ర, నంద్యాల ఆర్డిఓ మల్లికార్జున రెడ్డి, డిటిసి శివారెడ్డి, కేసీ కెనాల్ ఈఈ తిరుమలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే సోమవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోందని, ఈ మేరకు నిల్వ ఉన్న స్టాక్ పాయింట్ ల నుండి లోడింగ్, రవాణా చార్జీలు వినియోగదారుడే భరించాల్సి ఉంటుందన్నారు. నంద్యాల జిల్లాలో ప్రతిరోజు 5000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, ఇసుక నిల్వలు, స్టాక్ పాయింట్ లు జిల్లాలో లేని కారణంగా సమీప జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలోని స్టాక్ పాయింట్ ల నుండి రవాణా చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని గుడి కంబాలి స్టాక్ పాయింట్, కడప జిల్లా కొండాపురం మండలంలోని కే. వెంకటాపురం పి అనంతపురం, సిద్ధవటం మండలంలోని జ్యోతి, విఎన్ పల్లి మండలంలోని ఎర్రబల్లి స్టాక్ పాయింట్ ల నుండి ఉచిత ఇసుకను వినియోగదారులు రవాణా చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉచిత ఇసుక నిల్వల స్టాక్ పాయింట్లపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.స్టాక్ పాయింట్లు వద్ద వినియోగదారుడు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లతో వెళ్లి ఇసుక త్రవ్వటానికి, లోడింగ్ కు ప్రతి మెట్రిక్ టన్నుకు రు. 335/- ప్రకారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి వినియోగదారునికి 20 మెట్రిక్ టన్నుల వరకు ఇసుక తీసుకోవచ్చన్నారు. డిజిఎం పోర్టల్ లో లాగిన్ అయితే స్టాక్ పాయింట్ లలో ఉన్న ఇసుక నిలువలు వినియోగదారులకు కనిపిస్తాయన్నారు. ఇసుక తరలించే వాహనాలకు మాన్యువల్ పర్మిట్ లను తనిఖీ చేయాలని పోలీసు అధికారులను సూచించారు. జిల్లా నుండి అక్రమంగా తరలించే మట్టి, ఇసుక రవాణాలపై పోలీసు, రెవెన్యూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్లపై తనిఖీలు నిర్వహించాలని ఆర్డిఓను ఆదేశించారు. స్టాక్ పాయింట్ దగ్గర డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించి ఇసుక రవాణా చేసుకోవాలన్నారు. జిల్లాలోని వినియోగదారులకు ఇసుక లభ్యతపై ఎలాంటి సమస్యలు లేకుండా మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.