20 వ తేదీ నుండి ఇసుక నిల్వ డిపోలు ప్రారంభం
1 min readజిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఈనెల 20వ తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్సులు మంజూరు చేసిన వెండర్లచే ఇసుక నిల్వ డిపోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజ కుమారి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుండి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఇసుక సరఫరాపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ జి. రాజాకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్ లు లేనందున ఇసుక వినియోగదారుల సౌలభ్యం కోసం ఈనెల 20వ తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్సులు మంజూరు చేసిన వెండర్లచే ఇసుక నిల్వ డిపోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. నంద్యాల, బనగానపల్లెలో టన్ను ఇసుక 884 రూపాయలు, నందికొట్కూరులో టన్ను ఇసుక 744 రూపాయలు, ఆళ్లగడ్డలో టన్ను ఇసుక 719 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ధారించిన ధరకే వినియోగదారులకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదించారు. ఆత్మకూరు, డోన్ నియోజకవర్గాలలో కూడ ఇసుక నిల్వ డిపోల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించామని ఈనెల 19 తర్వాత అర్హులైన వెండర్లను ఖరారు చేసి మినరల్ డీలర్ లైసెన్సులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.అంతకుముందు మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ లు ఎన్ని, పనిచేస్తున్నవి ఎన్ని, ఇంకను ప్రారంభించాల్సినవి ఎన్ని, రీచ్‌లలో అవసరమైన మేర ఇసుక అందుబాటులో ఉందా, ఇసుక సరఫరా కొరకు ఏజెన్సీల ఎంపిక, ప్రస్తుత ఇసుక రేట్లు, బల్క్ రిజిస్ట్రేషన్ మరియు సరఫరా, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో నిఘా తదితర అంశాలలో జిల్లాల వారీగా మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కలెక్టర్లతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు ఫైనలైజ్ చేయని చోట్ల వెంటనే టెండర్లను పిలిచి ఒక వారంలోగా ఏజెన్సీలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు ఇసుకను అందిస్తోంది. సరిహద్దు చెక్‌పోస్ట్‌లలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భూగర్భ గనుల శాఖ ఏడి వేణుగోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.