PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిశ్రమల్లో భధ్రతా చర్యలు పటిష్టం చేయాలి

1 min read

అన్నిపరిశ్రమల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి,ఏస్ వో పీ పాటించాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ప్రతి సంస్ధకు విపత్తులను ఎదుర్కొనే ప్రణాళికలు ఉండాలి

జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పరిశ్రమల్లో ప్రమాధాల నివారణకు భధ్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.  జిల్లాలోని పరిశ్రమల్లో చేపట్టవలసిన భధ్రతా చర్యలపై సమీక్షించేందుకు ఆయా పారిశ్రామిక యాజమాన్యాలు, అధికారులతో బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లాస్ధాయి క్రైసెస్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ అంతర్గత ఆడిట్ పూర్తయినట్లు తెలియజేస్తే ఆయా పరిశ్రమలను జిల్లాస్ధాయి అధికారులు నిపుణులతోకూడిన కమిటీలు తనిఖీ చేసి భధ్రతకు నిర్ధేశిత ప్రమాణాల మేరకు అన్నిచర్యలు తీసుకునేది లేనిదీ నిర్ధారిస్తాయని పేర్కొన్నారు.  పరిశ్రమల్లో భధ్రతా చర్యలకు గౌ. ముఖ్యమంత్రి స్ధాయిలో అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.  జిల్లాలోని అన్ని పరిశ్రమలు పూర్తి భధ్రతా చర్యలు చేపట్టడంతోపాటు భధ్రతా చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించి ఏవైనా ఘటనలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై అవగాహన కలిగించాలన్నారు.   అదే విధంగా ఫ్యాక్టరీల్లో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందన్నారు.  పరిశ్రమలు, కార్మిక, ఫ్యాక్టరీస్, కాలుష్యనియంత్రణ, అగ్నిమాపక శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.  రెడ్ కేటగిరిల్లో ఉన్న పరిశ్రమల్లో రక్షణ, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్, ప్రొటోకాల్ ఖచ్చితంగా పాటించాలన్నారు.  ఇటీవల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాద ఘటనల నేపద్యంలో జిల్లాలో అన్ని పరిశ్రమల్లో భధ్రత పటిష్టం చేయాల్సివుందన్నారు.  తరచూ మాక్ డ్రిల్ చేపట్టడం ద్వారా కార్మికులు, ప్రజల్లో ప్రమాదాల నివారణ, ప్రమాదాల సమయంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై అవగాహన కల్పించాలన్నారు.  పరిశ్రమల్లో ఏర్పాటు చేసే అగ్నిప్రమాద నివారణ పరికరాలు సరైన రీతిలో పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు.  జిల్లాలోని ప్రతి ప్రరిశ్రమలో సేప్టీ అధికారిని ఏర్పాటు చేసుకొని వారికి జిల్లా అగ్నిప్రమాద నివారణ అధికారి వారు ఇచ్చే శిక్షణను పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  అదే విధంగా అన్ని పరిశ్రమలు జిల్లా ఫైర్ ఆఫీసరు వారి వద్ద ఎన్ఓసి పొందాలన్నారు.  ఫ్యాక్టరీలో చట్టం 1948 మరియు ఎపి ఫ్యాక్టరీ నియమాలు 1950 ప్రకారం వర్తించే అన్ని చట్టపరమైన నిబంధనలు అన్ని అమలు చేయాలన్నారు.  తయారీ, నిల్వ, దిగుమతి అంశాలకు సంబంధించి ప్రమాదకర రసాయనాల నియమాల చట్టం 1989 ప్రకారం అమలు చేయాలన్నారు.  ప్రమాదాలు జరిగినపుడు సంప్రదించేందుకు సమీపంలోని ఆసుపత్రులు, పోలీస్, తదితరుల అత్యవసర సేవలు అందించే శాఖల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ప్రతి పరిశ్రమలు ఏదైనా ప్రమాదం లేదా విపత్తు జరిగినప్పుడు తక్షణం ఎలా స్పందించాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఒక స్పష్టమైన కంటింజెంట్ ప్రణాళిక ఉండాలన్నారు. ప్రమాదాల సమయంలో తీసుకోవల్సిన చర్యలపై ప్రతిషిఫ్టులో ఒకరు బాధ్యతాయుతమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.  పరిశ్రమల్లో వాహనాల ప్రవేశ మార్గాలకు సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  ప్రమాదాలు సంభవించినప్పుడు పరిశ్రమల్లో కార్మికులను, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అలారం సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్రమాదాలపై కార్మికులతోపాటు పరిసర ప్రాంత ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు.  మాక్ డ్రిల్ నిర్వహించేటప్పుడు సమీప పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ ఇన్స్పేక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాధ్ రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జియం ఆదిశేషు, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ లేబర్ పి. శ్రీనివాస్, కాలుష్య నియంత్రణా మండలి ఇఇ నజీనా బేగం, జిల్లా ఫైర్ అధికారి సిహెచ్ రత్నబాబు, లీగల్ అండ్ మెట్రాలజీ జిల్లా కంట్రోలర్ వర ప్రసాద్, ఎపిఐఐసి జోనల్ మేనేజరు కె. బాబ్జి, ఆర్టిఓ శ్రీహరి, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, సిఐటియు నాయకులు డిఎన్ విడి ప్రసాద్, డియంహెచ్ఓ డా. శర్మిష్ట, జిల్లాలోని వివిధ ప్రారిశ్రామిక సంస్ద యాజమాన్యాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author