జూడో మార్షల్ ఆర్ట్స్ పోటీలు ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
1 min readవిద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు వ్యసనాలకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారు.
జూడో మార్షల్ ఆర్ట్స్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా దేశానికి ఉపయోగపడే క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలంటే క్రీడల్లో పాల్గొనడం ఎంతో అవసరం అని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న హుస్సేన్ ఖాన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన జూడో మార్షల్ ఆర్ట్స్ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూడో మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల క్రమశిక్షణ ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణించే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లకు బానిసలుగా మారారని, సెల్ ఫోన్ ను మంచి పనులకు ఎలా వాడవచ్చో, చెడు పనులకు కూడా అలాగే వాడే అవకాశం ఉందని చెప్పారు. మనం వినియోగించే పద్ధతిని బట్టి సెల్ ఫోన్ ప్రభావం ఉంటుందని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలు వివిధ రకాల రూపంలో విక్రయించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు పాఠశాల స్థాయి నుంచి గంజాయి వినియోగం మొదలవుతుందని ఇది దురదృష్టకర పరిణామం అని చెప్పారు .గంజాయి లాంటి మత్తు పదార్థాలు వినియోగం వల్ల హత్యలు, అత్యాచారాలు వంటి ప్రమాదకర నేరాలలో చిన్నారులు బాగ స్వాములవుతున్నారని వివరించారు. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో చిన్నతనం నుంచే ఊబకాయం సమస్య తలెత్తుతుందని దీనివల్ల బిపి షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల కలుషిత నీటి ప్రభావం వల్ల కలిగే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని చెప్పారు. కలుషిత నీరు తాగడం వల్ల కలరా, విరోచనాలు వంటి వ్యాధులు కలుగుతాయని తెలిపారు. అలాగే దోమ కాటు వల్ల డెంగీ, మలేరియా, మెదుడు వాపు వ్యాధి వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయని వివరించారు .ప్రతి ఒక్కరూ తాజా పండ్లు కూరగాయలు తినడం వల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా జీవించాలని ఆయన సూచించారు. అందుకే తాను క్రీడాకారులకు పండ్లు, బిస్కెట్లు ,మంచినీరు అందిస్తున్నానని తెలిపారు. ప్రతిరోజు ఒక ఆపిల్ పండు తినడం వల్ల డాక్టర్లకు వద్దకు వెళ్లి అవసరం లేకుండా జీవించవచ్చు అని తెలిపారు. జూడో ,కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల శారీరక ,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. అలాగే జూడో, కరాటే లో సాధన చేయడం వల్ల సుదీర్ఘంగా శ్వాస తీసుకోవడం , యోగ ప్రాణాయామం వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు కర్నూల్ నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.