ఏపీ లో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయండి
1 min readఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాతో లోకేష్ భేటీ
పల్లెవెలుగు వెబ్ దావోస్: ప్రపంచంలో నెం.1 టుబాకో ఉత్పత్తుల సంస్థ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ చైర్ పర్సన్ (ఎక్స్ టర్నల్ ఎఫైర్స్) ఆండ్రియా గోంట్కోవికోవాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఫిలిప్ మోరిస్ అనుబంధ సంస్థ అయిన గాడ్ ఫ్రే ఫిలిప్స్ ద్వారా దేశంలో 2వ అతిపెద్ద పొగాకు ఉత్పత్తి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయండి. ఇందుకు గుంటూరు, పరిసర ప్రాంతాలు అనువుగా ఉంటాయి. వ్యూహాత్మక విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అనుకూల ప్రాంతం. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున పొగాకు పంట సాగుచేస్తున్నారు. ఉత్పాదక కార్యకలాపాల కోసం అవసరమైన శ్రామికశక్తి ఎపిలో అందుబాటులో ఉంది. సప్లయ్ చైన్ కార్యకలాపాల అభివృద్ధికి ఎపి ప్రభుత్వంతోపాటు గుంటూరులో కొలువైన టుబాకో బోర్డు, పొగాకు రైతులు మీకు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ 27 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మిగులు విద్యుచ్చక్తి కలిగి ఉంది. 1054 కి.మీ.ల సువిశాల తీర ప్రాంతం, ఆరు ఆపరేషనల్ పోర్టులు కలిగి మారిటైమ్ ట్రేడ్ కు అనుకూల వాతావరణం కలిగి ఉందని మంత్రి లోకేష్ తెలిపారు.ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవా మాట్లాడుతూ… 2003 నుంచి భారత్ లో మా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే నెం.1 పొగాకు ఉత్పత్తుల సంస్థ అయిన ఫిలిప్ మోరిస్ గత ఏడాది అంతర్జాతీయంగా రూ.2.5లక్షల కోట్ల వార్షికాదాయాన్ని సాధించింది. ఫిలిప్ మోరిస్ అనుబంధ సంస్థ గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇంటర్నేషనల్ సిగరెట్ తయారీ యూనిట్లు నవీ ముంబయ్, ఘజియాబాద్ లో ఉన్నాయి. హర్యానాలోని గురుగ్రామ్ లో కార్పొరేట్ కార్యాలయం ద్వారా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రొక్యూర్ మెంట్ యూనిట్ ద్వారా గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియా రైతులనుంచి పొగాకు కొనుగోలు చేస్తోంది. పొగాకు సేకరణ, సప్లయ్ చైన్ కార్యకలాపాలతోపాటు స్పోక్ ఫ్రీ సిగరెట్ ఉత్పత్తులపై ప్రస్తుతం దృష్టి సారించాం. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆండ్రియా గోంట్కోవికోవా తెలిపారు.