PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్కిల్ సెన్సస్ నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండాలి!

1 min read

ప్రి ఎసెస్ మెంట్ తో పాటు అర్హతలను ఇంటిగ్రేట్ చేయాలి

స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

పల్లెవెలుగు వెబ్ అమరావతి: స్కిల్ సెన్సస్ అంతిమంగా నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సస్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సస్, స్కిల్ డెవలప్ మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఎసెస్ మెంట్ చేయకుండా కేవలం సెన్సస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రి ఎసెస్ మెంట్ కూడా వేగంగా పూర్తిచేయాలని అన్నారు. సెన్సస్ తోపాటే యువత, విద్యార్థుల అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, దీనివల్ల వారికి ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని తెలిపారు. బేసిక్ ఎసెస్ మెంట్ చేయడానికి ఇన్ఫోసిస్ సంస్థ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. ఎన్యుమరేషన్ సమయంలో ఇళ్లవద్ద అందుబాటులో లేనివారు యాప్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వారు తెలిపారు. సెన్సస్ పూర్తయిన తర్వాత జె.పాల్ సంస్థ ద్వారా ఎనలిటిక్స్ కూడా త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి సూచించారు. స్కిల్ సెన్సస్ తర్వాత పూర్తిస్థాయి సమాచారాన్ని వివిధ పరిశ్రమలు, సంస్థలకు అందుబాటులోకి తెస్తే వారికి అవసరమైన వారిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.  రాష్ట్రానికి పెద్దఎత్తున తరలివస్తున్న కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి వారికి ఏవిధమైన సిబ్బంది అవసరమో తెలుసుకోవాలని, సంబంధిత అర్హతలుగల అభ్యర్థుల సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచాలన్నారు. సెన్సస్ డాటాను లింక్డ్ ఇన్, నౌకరీ. కామ్, జాబ్ ఎక్స్ తదితర సంస్థలకు అనుసంధానిస్తే ఆయా ఏజన్సీల ద్వారా కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయమని మంత్రి తెలిపారు. ఉద్యోగార్దుల ఖచ్చితమైన సమాచారం కోసం పిఎఫ్, ఈఎస్ఐ, జిఎస్ టి వంటి శాఖల సమాచారాన్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. స్కిల్ డెవలప్ స్పెషల్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్షించారు. ట్రైన్ అండ్ హైర్ ప్రాతిపదికన వివిధ యూనివర్సిటీల్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఐబిఎం, మైక్రోసాఫ్ట్ కంపెనీలు అంగీకారం తెలిపినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యాన అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుచేసి, నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. దీనిపై ఇప్పటికే ఎల్ అండ్ టి సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో పెద్దఎత్తున నిర్మాణ కార్యకలాపాలు జరగనున్నందున నిర్మాణరంగానికి సంబంధించిన కంపెనీలను రప్పించి శిక్షణ ఇప్పించాలని మంత్రి సూచించారు. ఓంక్యాప్ ద్వారా విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా జర్మనీలో నర్సింగ్ స్టాఫ్ కు డిమాండ్ ఉన్నందున ఆ లాంగ్వేజ్ లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాలసీకి లోబడి అమరావతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి జి.గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు జి. అనిల్ కుమార్, కె. రఘు, అసిస్టెంట్ మేనేజర్ మోహన్ ఇమ్మని తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *