ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని రాయలసీమ విశ్వవిద్యాలయం గణితశాఖాధ్యక్షులు ఆచార్య పి.వి. సుందరానంద్ కొనియాడారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా వర్సిటీలోని వి.సి.కాన్ఫరెన్సు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రామానుజన్ 137వ జయంతిని పురస్కరించుకొని వర్సిటీలో నేషనల్ మ్యాథమేటిక్స్ డే నిర్వహించడం సంతోషకరమన్నారు. గణిత శాస్త్రానికి సంబంధించి విస్తృతంపరిశోధనలతో వివిధ ప్రతిపాదనలు చేసిన రామానుజన్ స్మృతిలో భారత ప్రభుత్వం ఆయన జన్మదినమైన డిసెంబరు 22ను జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహిస్తోందని వివరించారు. రామానుజన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు 20వ శతాబ్దపు గణిత మేధావుల్లో ఆయనకు సుస్థిర స్థానాన్ని ఏర్పరచాయని ఆచార్య సుందరానంద్ వివరించారు. అపరిష్కృతంగా నిలిచిన ఎన్నో గణిత సమస్యలకు రామానుజన్ చూపిన పరిష్కారాలను సోదాహరణంగా వివరించారు. అలాంటి గొప్ప పరిశోధకుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రామానుజన్ లాంటి ఓ గొప్పమేధావి. భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణమని వర్సిటీ రీసర్చ్ డైరెక్టర్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి కొనియాడారు. నిత్యజీవితంలో గణితం ఏవిధంగా ముడిపడిఉందో తెలుపుతూ స్ఫూర్తిదాయకమైన రామానుజన్ జీవిత విశేషాలను ఆయన వివరించారు. రామానుజన్ జీవించినది కేవలం 32 సంవత్సరాలే అయినప్పటికీ చిరకాలం నిలిచే పరిశోధనలు చేసిన రామానుజన్ ఆర్యభట్టలాంటి ప్రాచీన మేధావుల సరసన చేరదగిన మహనీయుడని వర్సిటీ డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్ కుమార్ నివాళులర్పించారు. గాయిత్రి, హర్షిత, జనార్దన్, సాయి మొదలైన విద్యార్థులు రామానుజన్ గణితశాస్త్రానికి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ గణితవిభాగ అధ్యాపకులు డాక్టర్ ఎం. వీరకృష్ణ, డాక్టర్ ఎస్.వి. సునీత, డాక్టర్ యు. నాగిరెడ్డితోపాటు వివిధ విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది పాల్గొని రామానుజనకు నివాళులర్పించారు.