బండి కి అండగా నిలవండి..
1 min readసిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పేలుపు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : నిత్యం ప్రజల పక్షాన పోరాడే ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావును గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల చొదిమెళ్ళ, రాజరాజేశ్వరి నగర్, బాలాజీ నగర్, టైటస్ నగర్, అశోక్ నగర్, నరసింహారావు పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రభాకర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి బండి వెంకటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తంగెళ్లమూడి సెంటర్లో జరిగిన ప్రచార సభలో డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపికి మరోసారి అవకాశం ఇస్తే దేశం అంధకారం అవుతుందని హెచ్చరించారు. కేంద్రంలోకి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం మోపుతూ సంపన్నులకు దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యాపారాలు పూర్తిగా కుంటుపడ్డాయన్నారు. మోడీ తాను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అదాని అంబానీలకు కారు చౌకగా కట్టబెడుతున్న కారణంగా యువత ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నిత్యం ఇండియా కూటమిలోని అందరూ అవినీతిపరులేనని అందుకే జైలుకు వెళ్లారని చెబుతున్నారని కానీ వాస్తవంగా దేశంలో భారీ కుంభకోణాలు చేసిన వారందరూ బిజెపి లోనే ఉన్నారని ఆరోపించారు. కుంభకోణాలలో ఉన్న ప్రధాన పాత్రధారులంతా బిజెపిలోనే ఉన్నారని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. బిజెపికి ఓటమి భయం పట్టుకున్నదని ఈ కారణం చేత తప్పుడు కేసులు నమోదు చేసి ఇండియా కూటమిలోని నాయకులను జైలుకు పంపుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి,జనసేన పార్టీలు బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని సంక్షేమం పేరుతో రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సమస్యల పరిష్కారం, పునరావాస కాలనీల మౌలిక సదుపాయాల కల్పన, వీటికి నిధులు ఇవ్వకుండా మోసం చేసిన మోడీని టిడిపి, జనసేన, వైసీపీలు బలపరచడం సిగ్గుచేటన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బిజెపిని, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలో సమస్యలు తిష్ట వేశాయని స్థానిక శాసనసభ్యుని హయాంలో ఏలూరు నగరం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య, తమ్మిలేరు కు అమీనాపేట వద్ద రిటైనింగ్ వాల్, మురికివాడల అభివృద్ధి సమస్యలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బండి వెంకటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న కావూరి లావణ్య కు హస్తం గుర్తుపై ఓట్లు వేసి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమస్యల పరిష్కారానికి చట్టసభలకు పంపాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, ఏఐటియుసి నాయకులు కడుపు కన్నయ్య, గేదెల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి గొర్లి స్వాతి, సిపిఎం నగర నాయకులు బుగత జగన్నాథం,జి. కోటేశ్వరరావు, ఎం.ఇస్సాక్ , భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.