గాయత్రి గోశాల అభివృద్ధికి కృషి చేస్తా.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min readగోశాల దాతలను సత్కరించిన నిర్వాహకులు
గోసేవ చేస్తే ఎంతో మేలు జరుగుతుందన్న మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గోసేవ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరశివారులోని డోన్ రోడ్డులో గాయత్రి గోసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాయత్రి గోశాలలో వెయ్యి గోవులు దాటిన సందర్భంగా దాతలకు సత్కారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టి.జి భరత్ పాల్గొని గోమాత దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోసేవ చేయాలన్నారు. గోశాలను ఏర్పాటుచేసినప్పటి నుండి నేటివరకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదన్నారు. దాతలను సత్కరించాలన్న ఆలోచన ఎంతో మంచిదన్నారు. గోసేవ చేయడం వలన తన జీవితంలో ఎంతో మేలు జరిగిందని మంత్రి తెలిపారు. ఇక గోవులకు సంతృప్తిగా గ్రాసం అందించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. అవసరమైతే గోశాలలో గుడి కట్టించేందుకు ఆలోచించాలని ఇదివరకే నిర్వాహకులకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. గోశాల అభివృద్ధికి ప్రభుత్వం తరుపున సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం దాతలను మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టి.జి శివరాజ్, గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్తా, ఇల్లూరు లక్ష్మయ్య, విజయ్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.