బాల్యవివాహాల నిషేధిత చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయండి
1 min readజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: బాల్యవివాహాల నిరోధానికి గ్రామ, మండల స్థాయిలో బాల్యవివాహాల నిషేధిత పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటై ప్రజల్లో బాల్యవివాహాల నిరోధంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బాల్యవివాహాల నిరోధక చట్ట అమలుపై క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ బాల్యవివాహాల నిరోధక చట్టం లోని ప్రభుత్వ జీఓ లోని 31, 39 లో ఉన్న అంశాలను క్షుణ్ణంగా చదివి బాల్యవివాహాల నిరోధకానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం, మండల స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సిన చర్యలపై వివరించాలన్నారు. ఇందుకోసం ఆర్డీవోలు, ఎంపీడీవోలు సమావేశాలు నిర్వహించి గ్రామ మండల స్థాయి కమిటీలు చురుకుగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల్యవివాహాల నిషేధిత చట్టాన్ని అతిక్రమిస్తే రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయలు జరిమానా విధించే అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం వుండి 58 బాల్య వివాహాలను ఆపలేకపోయామన్నారు. బాల్యవివాహాలు ఆపడంతోపాటు ఇరు వర్గాల తల్లిదండ్రులను కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. సచివాలయ మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, స్వయం సంఘ బృందాలు, పాఠశాలలు, కళాశాలలు సిబ్బంది చురుకుగా పనిచేసి బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాల కోసం కాళ్లు అరిగేలా తిరగకుండా సంబంధిత ఇళ్లకు వెళ్లి నిర్ణీత గడువులోగా ఇచ్చే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు బాధ్యత తీసుకొని బాల్యవివాహాలను సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాల్యవివాహాల కేసులను రిజిస్టర్ చేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్ష అమలుపరిస్తే ప్రజల్లో అవగాహన వస్తుందన్నారు.బాల్యవివాహాల నిరోధిక చట్టానికి పోలీస్ యంత్రాంగం నుండి పూర్తి సహకారం అందిస్తామని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు కలెక్టర్ కు వివరించారు. గ్రామస్థాయిలో ఈ చట్టంపై పూర్తి అవగాహన తీసుకొస్తే బాల్యవివాహాలు నియంత్రణ వ్యవస్థకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.