మూడు గంటల్లోగా తీసుకొస్తే స్ట్రోక్ బాధితులకు ఊరట
1 min readఇంజెక్షన్, మెకానికల్ థ్రాంబెక్టమీ లేదా శస్త్రచికిత్స
సమస్య తీవ్రతను బట్టి చికిత్స విధానాలు
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్
ఆస్పత్రిలో ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: బ్రెయిన్ స్ట్రోక్ ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే దీని లక్షణాలు ఏంటో తెలుసుకుంటే, అవి రాగానే తొలి మూడు గంటల్లోగా ఆస్పత్రికి తీసుకెళ్లి తగిన చికిత్స చేయిస్తే దీన్నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. ఈ సమస్య, దాని లక్షణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతుల గురించి వివరించేందుకు ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రికి చెందిన స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులో రక్తప్రసారం నిలిచిపోయి.. దానివల్ల ఏదైనా ఒక ప్రాంతం చనిపోతుంది. ఏ ప్రాంతం పాడైందో అందుకు సంబంధించిన సమస్య లక్షణాలు మనకు కనిపిస్తాయి. గుండెపోటులా కాకుండా ఇందులో పలు రకాల అవయవాలపై ప్రభావం కనిపించొచ్చు. చూపు పోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూతి వంకర పోవడం, మాట రాకపోవడం, నడవలేకపోవడం.. ఇలాంటివన్నీ స్ట్రోక్ లక్షణాలే. ఇవి వచ్చినప్పుడు మొదటి మూడు గంటల్లోగా సరైన ఆస్పత్రిలో సరైన వైద్యుడి వద్దకు తీసుకెళ్తే వెంటనే నయం చేయొచ్చు. స్ట్రోక్ తీవ్రతను బట్టి ఇంజెక్షన్ ఇవ్వడం, మెకానికల్ థ్రాంబెక్టమీ చేయడం లేదా అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేయడం లాంటి చికిత్సా పద్ధతులు పాటిస్తాం. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఈ అన్ని రకాల చికిత్సలకు సంబంధించిన అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక స్ట్రోక్ స్పెషలిస్టు, న్యూరాలజిస్టు, న్యూరోసర్జన్లు, స్పీచ్ థెరపిస్టు, ఫిజియోథెరపీ డిపార్ట్ మెంటు, సైకాలజిస్టు, సైకియాట్రిస్టు.. ఇలా అందరూ ఉన్నారు అని తెలిపారు. స్ట్రోక్ లక్షణాలు, వాటిని గుర్తించడం ఎలాగన్న అంశం గురించి అనేక మంది రోగులు, వారి కుటుంబసభ్యులు, సామాన్య ప్రజలు.. ఇలా అందరికీ అవగాహన కల్పించారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ అవగాహన కార్యక్రమంలో స్ట్రోక్ స్పెషలిస్టు డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్, న్యూరాలజిస్టు డాక్టర్ నీలోఫర్ అలీ, న్యూరో సర్జన్ డాక్టర్ అనిరుధ్ కె. పురోహిత్, స్పీచ్ థెరపిస్టు డాక్టర్ మోహన్ ఘంటసాల, ఫిజియోథెరపిస్టు డాక్టర్ షెరిన్ శామ్యూల్, సైకాలజిస్టు డాక్టర్ జాన్సే థామస్, డైటీషియన్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారందరికీ వైద్య నిపుణులతో ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కల్పించారు. స్ట్రోక్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీర్ఘకాలంలో చేయాల్సిన, చేయకూడని అంశాల గురించి వారికి అవగాహన కల్పించారు.