పాలస్తీనా ప్రజల విముక్తి పోరాటానికి సంఘీభావం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచవ్యాప్తంగా మే 15వ తేదీన ICOR (International Coordination of Revolutionary Parties & Organisations) ఇచ్చిన పిలుపు మేరకు గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న అమానుష మారణకాండను వ్యతిరేకిస్తూ, పాలస్తీనా ప్రజల విముక్తి పోరాటానికి సంఘీభావంగాకర్నూలు నగరంలోని అంబేద్కర్ సర్కిల్ నందు SUCI(C) పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో SUCI(C) పార్టీ జిల్లా ఇంచార్జీ వి. హరీష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ – ఇప్పటికే ముట్టడిలో ఉన్న అతి చిన్న భూభాగమైన గాజాపై, పశ్చిమాసియాలోని అమెరికా సామ్రాజ్యవాదానికి బ్రాంచ్ ఆఫీస్ గా ఉన్న జియోనిస్ట్ ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తి దిగ్బంధనాన్ని విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్యం కోరుకునే 23 లక్షల పైచిలుకు పాలస్తీనా ప్రజలు అక్కడ నివసిస్తున్నారని తెలిపారు. అనాగరికమైన దిగ్బంధనంతో పాటు, ఇజ్రాయెల్ భీకరమైన వైమానిక దాడులు గాజాపై నిరంతరంగా చేయడం ద్వారా ఇప్పటికే 35,000 మందికి పైగా చనిపోయారని, అందులో 14,500 కు పైగా చిన్న పసి పిల్లలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు… పూర్తిగా భూమిని శిథిలం చేసి నాశనం చేశారని అన్నారు… సామ్రాజ్యవాద వ్యతిరేక శాంతి-ప్రేమికులైన ప్రపంచ ప్రజలందరికీ తమ తారతమ్యాలు మరచి, యుద్ద పిపాసియైన జియోనిస్ట్ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మరియు వారి సామ్రాజ్యవాద గురువు మరియు మిత్రులకు వ్యతిరేకంగా ఐక్యంగా ముందుకు కదలాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైమానిక బాంబు దాడులను వెంటనే ఆపాలని, దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలని మరియు పాలస్తీనా నుండి వెంటనే వైదొలగాలని ఇజ్రాయెల్ ను గట్టిగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో SUCI(C) పార్టీ కర్నూలు నగర కార్యదర్శి ఎం. తేజోవతి, సభ్యులు ఖాదర్, విశ్వనాథ్ రెడ్డి, రోజా, మల్లేష్, శక్రప్ప, షానవాజ్, శివ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.