విద్యార్ధులు లక్ష్యసాధన దిశగా కృషించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
1 min readఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
నేను సి ఆర్ ఆర్ పూర్వ విద్యార్థి అయినందుకు గర్వపడుతున్న
80 మంది పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్న
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరులోని సర్ సీఆర్ఆర్ కాలేజ్ ఆడిటోరియంలో కళాశాల ఓల్ట్ స్టూడెంట్ప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పూర్వ విద్యార్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సిఆర్ఆర్ విద్యాసంస్థల కార్యదర్శి ఎంబీఎస్వీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి, కార్యదర్శి ఎంబీఎస్వీ ప్రసాద్లను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో 80 మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికీ 5వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహక చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ లక్ష్యసాధన దిశగా విద్యార్ధులు కృషిచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తాను సీఆర్ఆర్ పూర్వవిద్యార్ధినైనందుకు గర్వపడుతున్నానన్న ఎమ్మెల్యే ఇక్కడి గురువులు నేర్పిన క్రమశిక్షణే తనను ఇంతటి స్థాయికి చేర్చిందని గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఏలూరు చరిత్రలో ఇప్పటివరకు లేని రికార్డుస్థాయి మెజార్టీనిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నిబద్దతా, క్రమశిక్షణతో పాటూ విలువలతో రాజకీయాలు చేయాలనే విషయాన్ని తనతండ్రి బడేటి శ్రీహరిరావు నుండి తాను నేర్చుకున్నానని, ఆ విలువలతోనే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇద్దరు విద్యార్ధులకు ఆర్ధిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అయిన అనంతరం ఇప్పటివరకు 80 మంది విద్యార్ధులకు ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందించానన్నారు. తన తాత స్వాతంత్య్ర పోరాట భాగస్వామ్యంగా 10 వేల రూపాయలను ఆంధ్రరాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు అందించారని, ఇదేవిధంగా చరిత్రలో తమకంటూ ఒకపేజీని లిఖించేలా విద్యార్ధులు కృషించాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. విద్యాసంస్థల కార్యదర్శి ఎంబీఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ సీఆర్ఆర్ విద్యాసంస్థలు సాధించిన విజయాలను వెల్లడించారు. తానుకూడా ఇదే కళాశాలలో విద్యానభ్యసించానని గుర్తుచేసుకున్న ఆయన విద్యార్ధులంతా ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, డిగ్రీ కళశాల ప్రిన్సిపల్ కెఎ రామరాజు, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంవీ కృష్ణారావు, కార్యదర్శి వెన్నవల్లి సత్యనారాయణ, కోశాధికారి కాకరాల వేణుబాబు, జీపీ రావు, వి.మురళీమోహన్రావు తదితరులు పాల్గొన్నారు.