చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి
1 min readషూటింగ్ బాల్ క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి అవకాశాలుంటాయని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ లోని సిల్వర్ జూబ్లీ బీఈడీ కళాశాలలో ఏర్పాటుచేసిన షూటింగ్ బాల్ క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న, షూటింగ్ బాల్ జిల్లా అధ్యక్షుడు పరశురాముడు తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మిగతా క్రీడలతో పోలిస్తే షూటింగ్ బాల్ క్రీడ భిన్నమైనదని చెప్పారు. ఈ క్రీడలో క్రీడాకారులు సమిష్టి కృషితో విజయావకాశాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని, ఫలితంగా ఆరోగ్యంగా జీవించవచ్చని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం, గంజాయి వినియోగం అధికమైందని దీనివల్ల దుష్ఫలితాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. మనిషి బాగుపడడానికి 10 అవకాశాలు ఉంటే చెడిపోవడానికి 100 అవకాశాలు ఉన్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. యువత దురలవాట్లకు బానిస అయితే దేశ అభివృద్ధికి, దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని వివరించారు. ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత భుజస్కందాలపై ఆధారపడి ఉంటుందని ,ఈ విషయాన్ని యువత గుర్తించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. షూటింగ్ బాల్ క్రీడ ఒలంపిక్ క్రీడల్లో లేకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఉందని, ఈ క్రీడలో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకొని విజయవంతంగా జీవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. క్రీడల్లో పాల్గొంటే ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి అలవాటు ఉందని దీనివల్ల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే తత్వం పెంపొందుతుందని వివరించారు. మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు రెండు ఉంటాయని వాటిని భరిస్తూ ముందుకు సాగిన వారే విజయవంతంగా ఎదుగుతారని తెలిపారు. మనిషి జీవితంలో చదువుకు ఎంత ప్రాధాన్యత ఉందో క్రీడలకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలిపా.రు క్రీడల్లో పాల్గొనడం వల్ల సుదీర్ఘంగా శ్వాస తీసుకోవడంతో పాటు యోగ, ప్రాణాయామం వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు మిగతాయని వివరించారు. వీటివల్ల అత్యుత్తమమైన ఫలితాలు పొందవచ్చు అని తెలిపారు. మనిషి జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని అందుకే కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు సాగుతున్నారని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు.