సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి..
1 min readసిఎం చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్తున్నారు..
ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేయలేమని చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి..
ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ డిమాండ్.
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : రాష్ట్రంలో పాలన పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు అయిందని, టిడిపి బారా – బెత్తెడు పార్టీగా తయారైందని ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఆలూరులో ఆర్&బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే, చంద్రబాబు కైలాసం చూపిస్తున్నాడని ఎద్దేవా చేసారు. ప్రస్తుత టిడిపి కూటమి పాలన గత వైసిపి పాలనకంటే అద్వానంగా తయారైందన్నారు. టిడిపి బారా – బెత్తెడు పార్టీగా తయారు కావడం శోచనీయం అన్నారు.నిరుద్యోగభృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు యాభై ఏళ్లకే పెన్షన్ తదితర సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని, అదనపు పన్నుల ఛార్జీలు భారం మోపరాని, టిడిపి కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు బారెడు హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక బెత్తెడు హామీలు కూడా అమలు చేయలేదు,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారి పోయిందని, గాడిలో పెట్టేందుకు కొంత సమయం పడుతుందని, అంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేమని, ప్రజలపై పన్నుల భారం తప్పదని, ముఖ్యమంత్రి చావు కబురు చల్లగా చెప్పడం ఓటేసిన ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇది ఖచ్చితంగా నమ్మక ద్రోహమని ఇచ్చిన హామీలను తప్పక అమలు చేయాలని, తప్పించుకోవడం కుదరదని, హామీలు అమలు చేయడమా లేక పదవి నుండి దిగి పోవడమా తేల్చుకోవాలని సవాల్ విసిరారు.ఈ సమావేశంలో ఆలూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొలగవెళ్ళి రామాంజనేయులు,చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, ఉపాధ్యక్షులు కరెంటు గోవిందు, సీనియర్ నాయకులు తుంబలబీడు లక్ష్మన్న లింగంపల్లి హనుమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, వీరాంజనేయులు, ఆంథోనీ, రామాంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.