ఇండియా కూటమి అభ్యర్థులను ఆదరించండి…
1 min readఉపాధి హామీ కూలీలను కలుసుకొని ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి అభ్యర్థులను ఆదరించి చట్టసభలకు పంపాలని సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య లు విజ్ఞప్తి చేశారు. బుధవారం మండలంలోని నలకదొడ్డి గ్రామంలో ప్రజలను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెనుకబడ్డ పత్తికొండ నియోజకవర్గాన్ని గత పాలకులు అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. జిల్లాలో 106 చెరువులకు నీళ్లు నింపుతామని, పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారం చేపట్టాక నెరవేర్చింది లేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేపట్టే ఇండియా కూటమి అభ్యర్థులను చట్టసభలకు పంపినట్లయితే, హంద్రీనీవా కింద ఉన్న కుడి, ఎడమ కాలువ పనులను పూర్తి చేసి పదివేల ఎకరాలకు సాగునీరు అoదేవిధంగా తమ వంతు కృషి చేస్తామన్నారు. అలాగే పత్తికొండ పరిసర సమీప ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీకి రోజుకు కనీస వేతనం 400 రూపాయలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ సారి ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని ఉపాధి కూలీలను కోరారు.పత్తికొండ అసెంబ్లీ సిపిఐ. అభ్యర్థి పి. రామచంద్రయ్య గారి కంకి కొడవలి గుర్తుకు, కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ హస్తం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యలు తదితరులు పాల్గొన్నారు.