శునకాలకు పకడ్బందీగా శస్త్ర చికిత్సలు నిర్వహించాలి
1 min readభారత జంతు సంక్షేమ మండలి సభ్యురాలు అంజలి గోపాలన్
గార్గేపురం డంప్‌యార్డులో సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రం పరిశీలన
శునకాల చికిత్సలకు సకల సదుపాయాలు ఏర్పాటుపై సంతృప్తి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం వీధి కుక్కల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రాన్ని ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని భారత జంతు సంక్షేమ మండలి సభ్యురాలు అంజలి గోపాలన్, నగరపాలక అధికారులకు సూచించారు. శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రం నిర్వహణకు సంబంధించి అనుమతుల కోసం నగరపాలక, భారత జంతు సంక్షేమ మండలికి ధరకాస్తు చేసుకుంది. అందులో భాగంగా భారత జంతు సంక్షేమ మండలి సభ్యురాలు బుధవారం కర్నూలు నగరానికి వచ్చారు. నగర శివారు గార్గేపురం డంప్‌యార్డులోని శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. గార్గేపురం డంప్‌యార్డుకు చేరుకున్న ఆమెకు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె కేంద్రంలో ఉన్న శస్త్ర చికిత్స గదులు, శునకాల బోను, తదితర సౌకర్యాలను పరిశీలించారు. పలు యంత్రాల చిత్రాలను స్వయం తానే చరవాణిలో తీసుకున్నారు. నగరంలో శస్త్ర చికిత్సలు జరిగిన, ఇంకా జరగాల్సిన శునకాల సంఖ్య, కేంద్రంలో శునకాలకు అందించే ఆహారం, శస్త్ర చికిత్సలు నిర్వహించే పద్దతులు, వంటి వివరాలపై అంజలి గోపాలన్ ఆరా తీశారు. నగర శివారున విశాలమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో కేంద్రం ఏర్పాటు చేయడంపై ఆమె అధికారులను ప్రశంసించారు. శునకాలకు సంతాన నియంత్రణ క్షేత్ర చికిత్సలను పునః ప్రారంభించేందుకు, నవోదయ సొసైటీకి ప్రాజెక్ట్ రికగ్నేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అంజలి గోపాలన్ సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కుక్కల బెడద నివారణకు త్వరలోనే సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. తొలుత ప్రతిరోజు సామర్థ్యం ఉన్న 20 శునకాలకు శస్త్ర చికిత్సలను నిర్వహిస్తామని, మరో 12 శునకాలకు శస్త్ర చికిత్సలకు సంబంధించిన కేంద్ర నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. నగరంలో ఇప్పటికే 10,054 శునకాలకు శస్త్ర చికిత్సలు జరిగాయని, ఇంకా 4 వేలకు పైగా శునకాలకు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందన్నారు. ఒక్కొక్క శునకానికి శస్త్ర చికిత్స నిర్వహించేందుకు నగరపాలక రూ.1500 లు ఖర్చు చేస్తుందన్నారు. అనంతరం అంజలి గోపాలన్, అధికారులతో కలిసి కేంద్రం బయట మొక్కలు నాటారు.కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, వెటర్నరీ డాక్టర్ మల్దన్న, ఏఈ వైష్ణవి, నవోదయ సొసైటీ అధ్యక్షుడు గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.