మిట్నాల ఏపీ మోడల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల మండలం మిట్నాల ఏపీ మోడల్ స్కూల్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ భవిష్యత్తులో ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు, ఆదర్శ పాఠశాలలో ఎలాంటి విద్యాబోధన అందిస్తున్నారు, ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఇస్తున్నారా తదితర విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో టాయిలెట్లు బాగున్నాయా… రన్నింగ్ వాటర్ వస్తుందా తదితర విషయాలను అడిగి తెలుసుకుంటూ పరిశీలించారు. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల హాజరు సంబంధిత రికార్డులను కలెక్టర్ పరిశీలిస్తూ సంబంధిత వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను, వంటశాలను, స్టోర్ రూంను తనిఖీ చేశారు.మిట్నాలలో నూతనంగా నిర్మిస్తోన్న మోడల్ స్కూల్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలో తరగతి గదులతో పాటు వంటశాల, టాయిలెట్లు, పరిసర ప్రాంతాలను కూడ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.