ఈనెల 17 నుంచి “స్వచ్ఛతయే సేవ” కార్యక్రమం: జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో స్వచ్ఛతయే సేవ – 2024 కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. ఈ మేరకు సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు స్పందిస్తూ ప్రతి గ్రామంలో ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. “స్వచ్ఛతా స్వభావము – స్వచ్ఛతా సంస్కారం” అనే నినాదం ఇతివృత్తంగా ఈ ఏడాది పాటిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా ప్రజల భాగస్వామ్యం, సంపూర్ణ స్వచ్ఛత, సఫాయిమిత్ర సురక్ష అనే అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పక్షోత్సవ సంబరంలో భాగంగా ప్రతి గ్రామంలో ర్యాలీలు, మానవహారాలు, శ్రమదానం, చెత్తకుప్పల తొలగింపు, నీటి వనరుల ప్రాధాన్యం తెలియజేయడం, ప్రభుత్వ భవనాలు, సంస్మరణీయ స్థలాల వద్ద పారిశుధ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. వ్యర్ధాలులేని భారతదేశాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని 2017 నుంచి నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.