PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ వైసీపీ బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టొరీ..!

1 min read

బీజేపీతో టీడీపీ పొత్తు.. మోదీకి జగన్ తొత్తు

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  వైఎస్  షర్మిల

రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారన్న షర్మిల

నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలను నాశనం చేశారని మండిపాటు

ప్రత్యేక హోదాను సాధించలేక పోయారని విమర్శ

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:   ఏపీలో టీడీపీ వైసీపీ బీజేపీల ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడుస్తుందని  బిజెపితో టీడీపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీ బిజేపికి తొత్తు గా మారిందని ఏపీ పీసీసీ అధ్యకురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ న్యాయ బస్సు యాత్ర లో భాగంగా ఆదివారం నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించారు. నందికొట్కూరు పట్టణం పటేల్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తొగురు ఆర్థర్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఏపీ కి  ప్రత్యేక హోదా పదేళ్ల క్రితం వచ్చి ఉండాలి. కానీ హోదా తీసుకురావడంలో జగన్‌ ఘోరంగా విఫలమై చేతులు ఎత్తేశాడు. ఆయనకు కనీసం రాజధాని కట్టడమైనా చేతనైందా? ప్రత్యేక హోదా వస్తే ఒక్కో నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. దాంతో ఎంతో అభివృద్ధి జరిగి మన బిడ్డలకు ఎన్నో ఉద్యోగాలు వచ్చేవి. కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి గతంలో వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేశారు. తిరిగి జగన్‌ మరోసారి శంకుస్థాపన చేశాడు. ఇంకా ఎన్నిసార్లు పదేపదే శంకుస్థాపనలు చేస్తావ్‌ జగనన్న  అంటూ విరుచుకుపడ్డారు. ఇలాంటి పార్టీకి మళ్లీ ఓటు వేసేకన్నా  డ్రైనేజీలో వేయడం ఎంతో మేలని తెలిపారు. రైతుల సంక్షేమానికి రూ.300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్‌ చెప్పలేదా అని ప్రశ్నించారు. మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అవేమీ కనపడటంలేదా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల చేతికి చిప్ప మాత్రమే మిగిలిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ తర్వాత ప్రజలను మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని… రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఇంత మంది ఎంపీలను పెట్టుకుని హోదాను ఎందుకు సాధించలేక పోయారని ప్రశ్నించారు. నాసిరకం మద్యం అమ్ముతూ  వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని  ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని కోరారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే  మోదీకి జగన్ తొత్తుగా మారారని ఎద్దేవా చేశారు. వైసీపీ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది తన తండ్రి వైఎస్సార్ ఆకాంక్ష అని  వైఎస్సార్  ఆకాంక్ష నెరవేరాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, సీపీఎం సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author