ముఖ్యమంత్రి వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..
1 min readCITU జిల్లా కార్యదర్శి టి.శివరాం
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేల రూపాయల వేతనాలు ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని CITU జిల్లా కార్యదర్శి టి.శివరాం డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల శాసన మండలిలో శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్లు లేరు అని చెప్పడం సరైంది కాదన్నారు.ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జీవో విడుదల చేయలేదని అలాంటప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం బాధ్యతా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.వాలంటరీ వ్యవస్థ లేదనుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేతనాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ఎన్నికలలో లబ్ధి పొందడానికి మాయ మాటలు చెప్పి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో ఎన్నికల ముందు కొంత మంది వాలంటీర్లు రాజీనామాలు చేయగా రాష్ట్రంలో ఇంకా లక్ష మందికి పైగా రాజీనామా చేయకుండా విధులలో కొనసాగారని ఆయన తెలిపారు.వారంతా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చుతారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని వారి ఆశలను అడియాశలు చేయకుండా వెంటనే వారిని విధుల్లోకి తీసుకొని ఉపాధి కల్పించాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వారికి న్యాయం చేయాలని,బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,అదేవిధంగా బలవంతంగా రాజీనామాలు చేసిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేని యెడల వాలంటీర్లతో కలిసి కూటమి ప్రభుత్వం పై పోరాటాలను ఉద్రుతం చేస్తామని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రేపు శుక్ర,శనివారాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని సిఐటియు వాలంటీర్లకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.