అమ్మపాలే.. బిడ్డకు క్షేమం..
1 min read– అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం
– అగస్టు 1 నుండి 7 వరకు
డాక్టర్. ఉదయని, కన్సల్టెంట్ ఆబెస్ట్ట్రిక్స్ & గైనకాలజిస్ట్
కిమ్స్ సవీర, అనంతపురం
అనంతపురం, పల్లెవెలుగు: పుట్టిన నాటి నుండి 6 నెలల వరకు శిశువులందరికీ తల్లిపాలు చాలా ఉత్తమమైనవి మరియు మంచి పోషకాహారం. ఈ పాలు శిశువులకు సులభంగా జీర్ణమవుతాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వు పదార్థాలు కలిగి ఉంటాయి. తల్లి పాలలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి పిల్లలకు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. ప్రత్యేకంగా తల్లిపాలు తాగే పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, డయేరియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు సాధారణంగా ఫార్ములా ఫీడ్‌ల కంటే మెరుగైన రోగనిరోధక శక్తి ఉంటుంది. తల్లిపాలు తాగే పిల్లలకు ఆస్తమా, తామర మరియు అటోపిక్ చర్మ సంబధిత వంటి అలర్జీలు వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు తాగే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
తల్లికీ…మేలు…
తల్లి పాలివ్వడం వల్ల శిశువుతో పాటు తల్లికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గర్భధారణ బరువును వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రసవానంతర రక్తస్రావం తగ్గించడంలో సాహాయపడుతుంది. మరియు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బిడ్డ ఏడుపు….ఆకలికి సంకేతం కాదు…
తల్లిపాలు సహజమైనవి అయినప్పటికీ, అనేక మంది తల్లులు తల్లి పాలివ్వడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వారి కుటుంబ నేపథ్యం. చాలా మంది తల్లులలో వారి పాలు శిశువుకు సరిపోవు అనే ఓ సాధారణ అభిప్రాయం ఉంది. ఏ కారణం చేతనైనా శిశువు ఏడిస్తే… అది ఆకలికి సంకేతంగా పరిగణిస్తారు. అయితే కొంతమంది తల్లులు తప్పుడు సంకేతంగా భావించి డబ్బా పాలు అందిస్తున్నారు. శిశువు జన్మించిన తరువాత కొన్ని నెలల పాటు తల్లిపాలు కచ్చితంగా ఇవ్వాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 55% మంది తల్లులు మాత్రమే మొదటి 6 నెలల తమ పిల్లలకు తల్లిపాలు ఇస్తున్నారు.
తల్లికి…సమతుల్య ఆహారం…
తల్లిపాలు కాకుండా నీరు, తేనే ఇతర ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. శిశువులకు కృతిమంగా తయారు చేసిన పాసిఫైయర్‌లను పెట్టకూడదు. తల్లులు కూడా ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. స్థానికంగా ఉండే ఆచారాల ఆధారంగా అనవసరమైన ఆహార నియంత్రణలను నిలిపివేయాలి. పాలిచ్చే తల్లికి వారి కుటుంబం నిరంతరం మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించాలి. తల్లులందరికీ 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు లభించేలా చూడాలి. పై అన్ని సూచనలు పాటించడం వల్ల 6 నెలల వరకు తల్లిపాలను ప్రోత్సహించడం అధికం చేయవచ్చు.